దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. నిన్న, ఇవాళ ఉదయం భారీగా లాభాల స్వీకరణకు దిగిన పెట్టుబడిదారులు మధ్యాహ్నం తరవాత మరలా కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ భారీ నష్టాలతో 69920 వద్ద మొదలైంది. మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. చివరకు 358 పాయింట్ల లాభంతో 70930 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ కూడా లాభాల్లో ముగిసింది. 104 పాయింట్లు లాభపడి 21255 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు రాణించాయి. బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ షేర్లు స్పల్పంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో కొన్ని లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెలె ముడిచమురు 79 డాలర్లు, ఔన్సు బంగారం 2046 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.