ప్రధాన
ఎన్నికల కమిషనర్(CEC),
ఎలక్షన్ కమిషనర్లు(EC) నియామకానికి సంబంధించిన మార్గదర్శకాల
బిల్లును లోక్ సభ ఆమోదించింది. మూడింట రెండొంతుల మంది విపక్ష సభ్యులు సభ నుంచి
సస్పెండైన వేళ ఈ బిల్లుకు ఆమోదం లభించడం చర్చనీయాంశంగా మారింది.
విపక్షసభ్యుల
బలం తక్కువగా ఉన్న సమయంలో కీలక బిల్లులను ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించడం ద్వారా
ప్రజాస్వామ్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిందని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.
ఎన్నికల
కమిషన్ స్వయం ప్రతిపత్తికి హాని చేసేలా పాలక ఎన్డీయే వ్యవహరిస్తోందని
విమర్శిస్తున్నాయి.
గతంలోనే
పెద్దల సభ ఈ బిల్లును ఆమోదించగా ప్రస్తుతం లోక్ సభలో కూడా పాస్ కావడంతో రాష్ట్రపతి
సంతకంతో త్వరలో చట్టంగా మారబోతుంది. ఎన్నికల అధికారుల నియామకం, సర్వీస్ పరిమితులు,
ఆఫీసు కాలపరిమితి గురించి కొత్త బిల్లులో పొందుపరిచారు.
బిల్లుపై
చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్రన్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, 1991నాటి
ఎన్నికల అధికారుల చట్టంలో లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి కొత్త బిల్లును సభ ముందుకు
తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లును లోక్ సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
ప్రధాని,
విపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానల్ తో ఎన్నికలసంఘం
కమిషనర్లను నియమించాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో సూచించింది. రాజకీయ
ప్రలోభాలకు అతీతంగా ఎన్నికల సంఘం వ్యవహరించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు
సూచనను పట్టించుకోని ప్రభుత్వం చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్రమంత్రికి ప్యానల్ కు
చోటు కల్పించింది. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.