ఆదాయానికి
మించి ఆస్తుల కేసులో తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి మూడేళ్ళ జైలు శిక్ష
విధిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న
పొన్ముడికి జైలు శిక్షతోపాటు రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు
వెల్లడించారు.
సహ
నిందితురాలిగా ఉన్న పొన్ముడి భార్యకు కూడా కోర్టు రూ. 50 లక్షల జరిమానా
విధించింది. దోషిగా తేలిన పొన్ముడి రాష్ట్రమంత్రిగా ఉండటంతో తీర్పును నెలరోజులపాటు
నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదే
కేసులో పొన్ముడి ఆయన భార్య విశాలాక్షిని నిర్దోషులుగా ప్రకటిస్తూ వేలూరులోని దిగువ
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రెండురోజుల కిందటే కొట్టేసిన మద్రాస్ హైకోర్టు,
తీర్పును రిజర్వు చేసింది.
నేడు తీర్పు చెబుతూ మంత్రి, ఆయన భార్యను దోషులుగా
తేల్చింది. తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
రెండేళ్ళకు మించి శిక్ష పడటంతో పొన్ముడి తన శాసనసభ్యత్వాన్ని కొల్పోనున్నారు.
పొన్ముడి
1989లో డీఎంకే టికెట్ పై విల్లుపురం నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1996-2001లో
రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2002లో కేసు
నమోదు అయింది. విచారణలో తగిన ఆధారాలు లేనందున నిందితులను విడుదల చేస్తున్నట్లు
గతేడాది జూన్ 28న వేలూరు కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన
హైకోర్టు, మంత్రి పొన్ముడితో పాటు ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అవినీతి నిరోధక
శాఖ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం, పొన్ముడి, ఆయన భార్య ఆదాయానికి
మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించింది. మూడేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 50
లక్షల జరిమానా విధించింది.