పార్లమెంటులో మూకుమ్మడి సస్పెన్షన్లను (loksabha suspensions) వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల ఎంపీలు గురువారం నాడు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు ర్యాలీ తీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.
విపక్ష ఎంపీల ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహించారు.ప్రజాస్వామ్యంపై కేంద్రంలోని బీజేపీకి నమ్మకం లేదని వారు విమర్శించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చించడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో భద్రతపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్, ప్రధాని, హోం మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. భద్రతా వైఫల్యానికి కారకులను గుర్తించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.
డిసెంబరు 13న పార్లమెంటులో అలజడి తరవాత కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నాయని ఇప్పటి వరకు ఉభయ సభల్లో 143 మందిని సస్పెండ్ చేశారు. విపక్ష సభ్యులు సస్పెన్షన్లో ఉండగానే లోక్సభలో కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు.