బీజేపీ
పాలనతోనే దళితులు అభ్యున్నతి చెందుతారని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
గుడిసే దేవానంద్ అన్నారు. దళితుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కేటాయించిన
నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ
ఆధ్వర్యంలో జనవరి 5న మాదిగ మహాసభను విజయవాడలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ
మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా, కేంద్ర
మంత్రి నారాయణ స్వామి, శంభునాద్ తొండియా సభకు హాజరవుతారని
వెల్లడించారు.
దళితుల
సంక్షేమం కోసం ఎస్సీ మోర్చా మాత్రమే పోరాడుతుందన్నారు. ఎస్సీల సమస్యలు
పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి జగన్ నివాసాన్ని ముట్టడిస్తే తమ పై ఏడు కేసులు నమోదు
చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెనకబడిన
వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
గుర్తు చేసిన దేవానంద్, ఎస్సీ వర్గీకరణకు
అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తెలంగాణలో ప్రకటించారని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు 640
మండలాల్లో ర్యాలీలు చేపట్టామన్నారు.
మోదీ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడపగడపకూ వెళ్ళి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం జగన్ అసమర్థత కారణంగానే ఆంధ్రప్రదేశ్ రావణకాష్టంలా మారిందన్నారు. దళితుల కోసం
ఖర్చు చేయాల్సిన నిధులను దారిమళ్ళించారన్నారు. సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కన్వీనర్ ఎలిసెల కిషోర్, కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.