Ayodhya invitation for opposition leaders!
అయోధ్యలో 22 జనవరి 2024న జరగనున్న బాలరాముడి
మందిర ప్రాణ ప్రతిష్ఠ (Ayodhya Ram
Mandir Consecration) కార్యక్రమానికి
ప్రతిపక్ష నాయకులకు కూడా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Sriram Janmabhoomi Teerth Kshetra Trust) ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ కార్యక్రమానికి
కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi), ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), లోక్‌సభలో పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌధురిలను (Adhir Ranjan Chaudhari) రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం.
అయితే వారెవరూ కార్యక్రమానికి హాజరు కాబోరని తెలుస్తోంది.
మాజీ ప్రధానమంత్రులు డా.మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh), దేవెగౌడలకు (Deve
Gowda) కూడా ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందాయని
తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరింతమంది విపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తారట. ప్రధాన
రాజకీయ పక్షాల నేతలందరినీ రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ట్రస్ట్ పిలవనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), బీఎస్పీ
అధినేత్రి మాయావతి (Mayawati), సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి (Sitaram Yechury), సీపీఐ నాయకుడు డి
రాజా (D Raja) తదితరులను ఆహ్వానిస్తారని సమాచారం.
కొద్దిరోజుల క్రితం ట్రస్ట్ సభ్యులు
బీజేపీ సీనియర్ నేతలు లాల్‌కృష్ణ ఆఢ్వాణీ (L K Advani), మురళీ మనోహర్
జోషిలకు (Murli Manohar Joshi) ఆహ్వానపత్రికలు అందజేసారు. అయితే వారి వయోభారం, ఆరోగ్యం దృష్ట్యా
కార్యక్రమానికి రావొద్దని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఆ మరునాడే వారిద్దరినీ
కార్యక్రమానికి ఆహ్వానించామనీ, వారిద్దరూ రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని
చెప్పారనీ విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. రామజన్మభూమి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతల్లో లాల్‌కృష్ణ ఆఢ్వాణీ, మురళీ
మనోహర్ జోషీ అగ్రగణ్యులు.
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
దేశంలోని అత్యున్నత స్థాయి సాధుసంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, శాస్త్రవేత్తలు,
సైనికాధికారులు, పద్మపురస్కారాల గ్రహీతలు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలకు చెందిన
ప్రముఖులు, దలైలామా వంటివారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది.
రామ్‌లల్లా ఆలయాన్ని సుమారు 1800 కోట్ల
వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆలయ ప్రధాన భాగం నిర్మాణం పూర్తవడంతో వచ్చే జనవరి 22న
ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఆనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ప్రసంగించే అవకాశముంది.