హమాస్ ఉగ్రవాదులను సమూలంగా మట్టుపెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం (Israel hamas war) భీకరదాడులు కొనసాగిస్తోంది. హమాస్ ఉగ్రవాదుల మూలాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. తాజాగా గాజాలో హమాస్ ఉగ్రవాదుల అతిపెద్ద కమాండ్ కేంద్రాన్ని ఐడీఎఫ్ గుర్తించింది. హమాస్ నెట్వర్క్ మొత్తాన్ని ఇక్కడి నుంచే నిర్వహిస్తోన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం అనుమానిస్తోంది. అయితే తాజాగా గుర్తించిన సొరంగ కేంద్రాన్ని ఎక్కడ గుర్తించారో మాత్రం ప్రకటించలేదు.
బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ తీసుకువచ్చిన ప్రతిపాదనను హమాస్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. హమాస్ చెరలో ఉన్న 40 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్ 7 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని సిద్దం చేసినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. గాజాలో దాడులు పూర్తిగా ఆపితేనే చర్చలకు వస్తామని హమాస్ ప్రకటించింది. జైళ్లలోని ఖైదీలందరినీ విడుదల చేస్తేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా స్పందించారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందాలు కనిపించే మార్గం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.