భారతీయ
శిక్ష్మాస్మృతి(IPC), నేర శిక్ష్మాస్మృతి(CRPC), సాక్ష్యాధారాల చట్టం(EA ) స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం
తీసుకొచ్చిన మూడు నేర శిక్షా స్మృతి బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. వీటి
స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS),
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS ),
భారతీయ సాక్ష్య అధినియమ్ (BSA) పేరిట కొత్త బిల్లులను లోక్ సభలో
ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.
రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులు
ఆమోదిస్తే ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లులు చట్టాలుగా మారుతాయి.
భారతీయ
భావనతో న్యాయ వ్యవస్థ ఉండేలా బిల్లులు సభ ముందుకు తెచ్చామని, బానిసత్వ భావజాలం నుంచి
విముక్తి కల్పించామని కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి స్పష్టమైన
నిర్వచనం ఇవ్వడంతో పాటు రాజద్రోహం వంటి పదాలు తొలగించినట్లు వివరించారు.
కేంద్రప్రభుత్వం
తీసుకొస్తున్న కొత్త చట్టాలు శిక్ష కంటే న్యాయంపైనే ఎక్కువ దృష్టి పెడతాయని అమిత్
షా వెల్లడించారు. మూకదాడులకు పాల్పడితే మరణ దండన విధించే సెక్షన్ కొత్త బిల్లులో
ఉందన్నారు.
పాత
చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండగా, కొత్త బిల్లులో దానిని సెక్షన్
63గా మార్చారు. పాత చట్టంలో హత్యకు సంబంధించి 302 సెక్షన్ ఉండగా, కొత్త బిల్లులో
దానిని 101 గా పెట్టారు.
ఆత్మహత్యకు
ప్రయత్నించడం నేర జాబితా నుంచి తొలగింపు, భిక్షాటన మావన అక్రమ రవాణా నేరంగా
పరగిణించేలా కొత్త బిల్లులో చేర్చారు. రూ. 5 వేలు లోపు దొంగతనాలకు సమాజ సేవ శిక్షను
న్యాయ సంహిత బిల్లులో చేర్చారు.
భారతీయ
నాగరిక్ సురక్షా సంహిత బిల్లులో మేజిస్ట్రేట్ విధించే జరిమానా పరిమితి పెంపు అంశాన్ని
చేర్చారు. మూడేళ్ళ లోపు శిక్షలు పడే కేసుల్లో అరెస్టుకు సీనియర్ పోలీసు అధికారులు
ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త బిల్లులో పేర్కొన్నారు. దేశమంతా జీరో
ఎఫ్ఐఆర్ తో పాటు, ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ నమోదుకు వీలు కల్పించారు.
భారతీయ
సాక్ష్యా అధినియమ్ బిల్లులో రెండు కొత్త సెక్షన్లు చేర్చిన కేంద్రప్రభుత్వం, వాటికి
ఆరు సబ్ సెక్షన్లు జోడించింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో సాక్ష్యం సేకరణకు అనుమతి ఇవ్వడంతో
పాటు సాక్ష్యానికి నిర్వచనాన్ని చేర్చారు.