4 సంవత్సరాలలోపు చిన్నారులకు ఇచ్చే దగ్గు మందులు నిషేధం
చిన్న పిల్లలకు దగ్గు నివారణకు ఇచ్చే మందుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా 141 మంది, దేశంలో 2019లోనే 12 మంది చనిపోయారని డ్రగ్స్ రెగ్యులేటర్ నిర్థారించింది. దీంతో దేశంలో నాలుగేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే యాంటీ కోల్డ్ మందులపై కేంద్రం నిషేధం విధించింది. నిర్ధారణ చేయని, అసంబద్ద యాంటీ కోల్డ్ డ్రగ్స్ (india bans anti cold drugs) ఫార్ములేషన్ వల్లే ఇలాంటి మరణాలు చోటు చేసుకున్నాయని దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అసంబద్ధ కాంబినేషన్లను ఉపయోగించకూడదని డ్రగ్స్ రెగ్యులేటర్ సిఫార్సు చేసింది.
గత ఏడాది గాంబియా, ఉబ్జెకిస్తాన్, కామెరూన్ దేశాల్లో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గుమందు వల్ల 141 మరణాలు నమోదయ్యాయి. 2019లో మన దేశంలోనూ 12 మంది చిన్నారులు దగ్గు మందు వల్ల చనిపోయారని నిర్థారించారు.
4 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లలకు ఎఫ్డీసీ ఉపయోగించరాదనే హెచ్చరికలతో మాత్రమే ఇక నుంచి దగ్గు మందులను విడుదల చేయాల్సి ఉంటుంది. క్లోర్ ఫెనిరమైన్, ఫినైల్ఫ్రైన్ మందులు దగ్గు మందులో కలుపుతున్నారు. సాధారణ జలుబు, దగ్గు లక్షణాలు తగ్గించడానికి సిరప్లు, టాబ్లెట్లలో ఈ మందులు ఉపయోగిస్తున్నారు.