స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి కుప్పకూలాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (stock markets) ఇవాళ కూడా తీవ్ర నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న ప్రతికూల ఫలితాలకుతోడు, పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో మరోసారి కోవిడ్ విజృంభించడం కూడా మార్కెట్లలో భయాలు పెరగడానికి దారితీశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా స్టాక్ సూచీల పతనానికి దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 432 పాయింట్లు నష్టపోయి 70074 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి, 21009 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి రూ.83.22వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బుధవారంనాడు అమెరికా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. జీడీపీ, ద్రవ్యోల్భణం అంచనాలు ప్రతికూలంగా వస్తాయనే అంచనాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి.