ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సుక్మా జిల్లా చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో (encounter) ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. నాగారం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా దళాలు, మవోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. కోబ్రా, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ దళాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మరణించి ఉంటారని తెలుస్తోంది.
ఎన్కౌంటర్ తరవాత ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులు అలజడి సృష్టించారు. జగదల్పూర్ నుంచి విజయవాడ వస్తున్న గన్నవరం డిపో బస్సుకు నిప్పుపెట్టారు. అది పాక్షికంగా దహనమైంది. 40 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. చట్టి నుంచి భద్రాచలం వైపు వెళ్లే వాహనాలను కూనవరం మీదుగా మళ్లించారు. ఘటనకు నిరసనగా ఈ నెల 22న మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు.