Complaint to Ethics
Committee on MPs who insulted RS chairman
రాజ్యసభ ఛైర్మన్‌ను అవమానించిన ఎంపీలపై
పార్లమెంటు ఎథిక్స్ కమిటీలకు ఫిర్యాదు అందింది. జగదీప్ ధన్‌ఖడ్‌ను అవహేళన చేసిన టీఎంసీ
ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఇతర ఎంపీలను సభ నుంచి బహిష్కరించాలంటూ సామాజిక కార్యకర్త,
న్యాయవాది వినీత్ జిందాల్ లోక్‌సభ, రాజ్యసభల ఎథిక్స్ కమిటీలకు ఫిర్యాదు చేసారు.
రాజ్యసభ ఛైర్మన్‌ను అవహేళన చేసేలా
మిమిక్రీ చేసిన కళ్యాణ్ బెనర్జీతో పాటు ఆ ఘటనను వీడియో తీసిన రాహుల్ గాంధీ, ఇతర
ఎంపీలను కూడా పార్లమెంటు నుంచి బహిష్కరించాలని వినీత్ జిందాల్ ఫిర్యాదు చేసారు.
‘‘భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్
అయిన జగదీప్ ధన్‌ఖడ్ సభలో విధులు నిర్వహిస్తుండగా ఆయనను అవహేళన చేసేలా మిమిక్రీ
చేస్తూ సభాధిపతి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్
బెనర్జీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర ఎంపీల మీద ఈ ఫిర్యాదు చేస్తున్నాను’’
అని వినీత్ జిందాల్ చెప్పారు.
‘‘ఇటీవల ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో
ఒక వీడియో విస్తృతంగా ప్రచారమైంది. అందులో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ
చైర్మన్, దేశ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ అవహేళన చేసారు.
చుట్టూ ఉన్న ఇతర ప్రతిపక్షాల ఎంపీలు చైర్మన్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ
అల్లరి చేసారు. సీనియర్ నాయకుడైన రాహుల్ గాంధీ ఆ అవహేళనను ఆస్వాదిస్తూ వీడియో
తీసారు. ప్రతిపక్ష నేతలు పాల్పడిన అటువంటి చేష్టలు అత్యంత అవమానకరమైనవి,
సభామర్యాదకు హాని కలిగించేవి, గౌరవ సభ్యుల నుంచి సభ ఆశించే ప్రమాణాలకు ఎంతమాత్రం
తగనివి.’’
‘‘అటువంటి దుష్ప్రవర్తన అమర్యాదకరమైనది,
పార్లమెంటరీ సభ్యతకు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనది. భారత ఉపరాష్ట్రపతి, భారత
పార్లమెంటులో ఒక సభలో అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించే వ్యక్తిని అవహేళన
చేయడం ఎంతో అగౌరవకరం. స్వయంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులే అలాంటి అమర్యాదకరమైన ప్రవర్తనకు
పాల్పడడం సిగ్గుచేటు. ఎథిక్స్ కమిటీ సూచించిన నైతిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి
ఉండడంలో ఈ ప్రతిపక్ష నాయకులు విఫలమయ్యారు. రాజ్యసభ చైర్మన్‌ను అవహేళన చేయడం అనే
దుష్ప్రవర్తనకు పాల్పడడం పార్లమెంటు ప్రతిష్ఠకు భంగకరం మాత్రమే కాక, ఆ సభ్యుల
విశ్వసనీయతను కూడా ప్రశ్నార్థకం చేసింది’’ అని వినీత్ జిందాల్ ఆగ్రహం వ్యక్తం
చేసారు.
‘‘పార్లమెంటరీ నైతిక నియమావళి ప్రకారం
సభలో కానీ సభ బైట కానీ ఇటువంటి దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు వారిని
శిక్షించడానికి సభకు హక్కు ఉంది. సభ్యుల ప్రవర్తన సభ గౌరవానికి భంగం కలిగించేదిగా
తేలితే, లేదా సభా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ సభ్యులు ప్రవర్తిస్తే, అటువంటి ఎంపీలను
సభ బహిష్కరించవచ్చు’’ అని వినీత్ జిందాల్ గుర్తు చేసారు.
‘‘ఈ సభ్యులు ఇలాంటి దుష్ప్రవర్తనకు
పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. వారిలో కొందరు ఇప్పటికే తమ వైఖరికి ఇప్పటికే సభనుంచి
సస్పెండ్ అయ్యారు. వాళ్ళకు నేరాలు చేయడం అలవాటైపోయింది. అందువల్ల వాళ్ళకు ఏ అవకాశమూ
ఇవ్వకుండా వారిని సభ నుంచి బహిష్కరించాలి’’ అని కోరారు.
ఆ ఘటన గురించి మాట్లాడుతూ కళ్యాణ్
బెనర్జీ తనకు రాజ్యసభ ఛైర్మన్‌ను అవమానించే ఉద్దేశం లేదనీ, మిమిక్రీ అనే కళను
మాత్రమే ప్రదర్శించాననీ సమర్ధించుకున్నారు. పైగా, జగదీప్ ధన్‌ఖడ్ సభలో అలాగే
ప్రవర్తిస్తారా అంటూ ఏమీ తెలియనట్టు అమాయకత్వం నటించారు.
జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ వ్యక్తిగా
తనను ఎంత అవమానించినా పట్టించుకోననీ, రాజ్యసభ ఛైర్మన్ అనే రాజ్యాంగబద్ధమైన పదవిని
అవమానించడం తీవ్రంగా బాధించిందన్నారు.
ఇక ఎన్డీయే ఎంపీలు
రాజ్యసభలో ఛైర్మన్‌కు తమ మద్దతు ప్రకటిస్తూ గంట పాటు సభకార్యక్రమాలు జరుగుతుండగా
నిలబడ్డారు.