ఎన్డీయేకు
వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండీ కూటమిలో ఆది నుంచి భాగస్వామ్య
పక్షాల మధ్య విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. పేరుకు కూటమి కట్టినా ఎన్నికల దగ్గరికి
వచ్చే సరికి ఎవరిదారిన వారే పోతున్నారు. గత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ
ఇదే తతంగం నడిచింది.
సమాజ్వాదీ
పార్టీ, జేడీయూ, టీఎంసీలతో కాంగ్రెస్కు పొసగడం లేదనేది బహిరంగ రహస్యమే. తెలంగాణలో
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య కూడా సంబంధాలు కూడా అంతంతమాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో
సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తే సీపీఐ మాత్రం
ఒక్క సీటు కోసం కాంగ్రెస్ తో దోస్తీ చేసింది.
పంజాబ్
లో కూడా ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆక్కడ ఆప్, కాంగ్రెస్ మధ్య ఏమాత్రం
సయోధ్య లేదు.
ఆప్
పంజాబ్ శాఖ కాంగ్రెస్ తో కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపుతోంది. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు
చర్చల సమయంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్
ను ఓడించి ఆప్ పాలక పార్టీగా అవతరించింది. ఇప్పుడు ఆపార్టీతో పొత్తుతో ప్రజలు ముందుకు
వెళ్ళడంతో లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుదనేది ఆప్ నేతల లెక్క. ఇటీవల జరిగిన
ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కూడా ఆప్ దూరం జరిగేందుకు ఓ కారణం.
పొత్తుల
లెక్కలు మారుతుండటంతో కాంగ్రెస్ గుర్రుగానే ఉంది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా మాట్లాడుతూ తమ
పార్టీ 13 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు.
ఆప్,
కాంగ్రెస్, ఇండీకూటమిలోని పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పై చర్చలు కొనసాగుతూనే
ఉన్నాయి. ఆప్ వైపు నుంచి ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి
ఉంది. ఆయన పదిరోజుల ధ్యాన కార్యక్రమానికి వెళడంతో చర్చలకు అంతరాయం ఏర్పడింది.
బలమైన
బీజేపీని ఎదిరించే సత్తా ఇండీ కూటమికి ఉందా అనే సవాళ్ళకు సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితి
తలెత్తడం కాంగ్రెస్ కు సంకటంగా మారింది.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ లు
వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శనతో చతికిలబడగా బీజేపీ మరోసారి
అధికారాన్ని నిలబెట్టుకుంది.