Two more MPs suspended from Lok Sabha
లోక్సభ నుంచి ఇవాళ మరో ఇద్దరు ప్రతిపక్ష ఎంపీలను
దుష్ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేసారు. దీంతో ఈ సమావేశాల్లో ఇప్పటివరకూ పార్లమెంటు
నుంచి సస్పెండ్ చేసిన సభ్యుల సంఖ్య 143కు చేరుకుంది. ఇంతమంది సభ్యులను సస్పెండ్
చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి.
గత వారం పార్లమెంటులో భద్రతా వైఫల్యం కారణంగా లోక్సభలో
ఇద్దరు యువకులు స్మోక్ క్యానిస్టర్లు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్చకు
పట్టుపట్టిన ప్రతిపక్షాలు రగడ సృష్టించాయి. హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ
సభాకార్యక్రమాలను స్తంభింపజేసాయి.
పార్లమెంటు లోపల భద్రతకు సంబంధించిన ఏ అంశమైనా సచివాలయం
పరిధిలోకి వస్తుంది తప్ప అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోడానికి అనుమతించే ప్రసక్తే
లేదని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా స్పష్టం చేసారు. అందువల్ల ఈ అంశంపై హోంమంత్రిని
సభలో ప్రకటన చేయనీయబోనని స్పీకర్ స్పష్టంగా వెల్లడించారు.
అయితే ప్రతిపక్ష ఎంపీలు తమ పట్టు వీడలేదు. అమిత్
షా ప్రకటన చేయాల్సిందేనంటూ రగడ కొనసాగించాయి. అక్కడినుంచి ఎంపీల సస్పెన్షన్ల కథ
మొదలైంది. ఇప్పటివరకూ లోక్సభ నుంచి 97మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 46 ఎంపీలను
సస్పెండ్ చేసారు.
లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ కేరళ కాంగ్రెస్
(మణి) పార్టీకి చెందిన ఎంపీ థామస్ చళిక్కాడన్, సీపీఎం పార్టీకి చెందిన ఏఎం ఆరిఫ్లను
సస్పెండ్ చేసారు. ఈ సమావేశాలు పూర్తయేవరకూ వారిద్దరినీ సస్పెండ్ చేసారు. పార్లమెంటరీ
వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఫలితంగా వారిద్దరిపై
సస్పెన్షన్ వేటు పడింది.
లోక్సభలో ప్రతిపక్షాల సభ్యులు మొత్తం 142మంది
ఉన్నారు. వారిలో 97మంది సస్పెండయ్యారు. ఇక రాజ్యసభలో ఇప్పుడు ప్రతిపక్ష ఎంపీలు
వందలోపే ఉన్నారు. అంటే రెండు సభల్లోనూ పాలక పక్షానికి ఇప్పుడు ఏ సవాలూ లేదు. ఈ
సమయంలో ఏ బిల్లునైనా పాస్ చేసుకోవడం ప్రభుత్వానికి చాలా సులువైన సంగతి.