AP BJP: పేదల ఇళ్ళ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ
బీజేపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేసినా
లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తోందని ఆగ్రహం
వ్యక్తం చేశారు.
సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్డీవో కార్యాలయాన్ని బీజేపీ
కార్యకర్తలు ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.
25 లక్షల
ఇళ్ళు కట్టలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలు ఎందుకు కట్టలేకపోయారని
ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వైసీపీ
పాలనలో ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయని పేదలపై ఆర్థిక భారం మోపడమే లక్ష్యంగా
వైసీపీ పాలన ఉందని దుయ్యబట్టిన విష్ణువర్ధన్ రెడ్డి, కేంద్రం సహకరిస్తున్న పాలనలో
వైసీపీ విఫలమైందన్నారు.
గత
ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు 2024లో టికెట్లు ఇవ్వడం
లేదంటే పాలనలో వైసీపీ విఫలమైనట్లేనని ఒప్పుకున్నట్లేనా అని నిలదీశారు. వైసీపీ తమ
అభ్యర్థులను మార్చినట్లే రాష్ట్రప్రజలు వైసీపీ రాతను మార్చబోతున్నారని జోస్యం
చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్,
జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, నేతలు రామకృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు.