PM calls RS Chairman amid
mimicry row
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ప్రతిపక్ష
ఎంపీలు అవమానించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఉదయం
మోదీ తనకు ఫోన్ చేసారని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు.
జరిగిన ఘటన తనను చాలా నొప్పించిందని ప్రధాని
చెప్పారని ధన్‌ఖడ్ ట్వీట్ చేసారు. కొందరు ఎంపీలు తనను అవహేళన చేస్తూ అనుకరించడం,
అది కూడా పవిత్రమైన పార్లమెంటు ఆవరణలో అలాంటి నాటకాలకు పాల్పడడంపై మోదీ
బాధపడ్డారని ధన్‌ఖడ్ చెప్పారు.
‘‘తను ఇలాంటి అవమానాలను గత 20 ఏళ్ళుగా
ఎదుర్కొంటున్నాననీ, అవి ఇంకా కొనసాగుతాయనీ మోదీ గుర్తు చేసుకున్నారు. అయితే దేశ
ఉపాధ్యక్షుడు అనే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారిని, అది కూడా పార్లమెంటు ఆవరణలో
అవమానించడం దురదృష్టకరమని మోదీ అభిప్రాయపడ్డారు’’ అని జగదీప్ ధన్‌ఖడ్ తన ట్వీట్లో
వివరించారు. అయితే ఇటువంటి దుందుడుకు చర్యలు తనను తన విధులు నిర్వహించకుండా
ఆపలేవని ప్రధానికి చెప్పానని రాజ్యసభ ఛైర్మన్ వివరించారు. భారత రాజ్యాంగం అందించిన
విలువలకు తాను హృదయపూర్వకంగా కట్టుబడి ఉన్నాననీ, వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ
పరిరక్షిస్తాననీ ధన్‌ఖడ్ అన్నారు. ఎలాంటి అవమానాలూ తనను తన మార్గం నుంచి తప్పించలేవని
ప్రధానికి చెప్పినట్లు పెద్దల సభ ఛైర్మన్ వివరించారు.
నిన్న మంగళవారం నాడు పెద్దసంఖ్యలో సస్పెన్షన్
తర్వాత పార్లమెంటు ఆవరణలో సమావేశమైన విపక్ష సభ్యులు అధికారపక్షంపై తీవ్ర విమర్శలు
చేసారు. ఆ క్రమంలో పశ్చిమబెంగాల్ శ్రీరాంపూర్ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి
చెందిన కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ శారీరక వైకల్యాన్ని
అవహేళన చేస్తూ ఆయనను అనుకరిస్తున్నట్లు పార్లమెంట్ మెట్ల మీద నటించారు. విపక్ష
సభ్యులు దానికి నవ్వుతుండగా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఆ వ్యవహారాన్ని తన
మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా
వ్యాపించింది.
ఆ ఘటనపై జగదీప్ ధన్‌ఖడ్ నిన్ననే సభలో తన
ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. రాజ్యాంగబద్ధ పదవిని గౌరవించాలన్న ప్రాథమిక సూత్రాన్ని
మరిచారా అని నిలదీసారు. తృణమూల్ సభ్యుడి ప్రవర్తన తన రైతు కుటుంబం నేపథ్యాన్ని, తన
జాట్ కులాన్నీ అవమానించిందని మండిపడ్డారు.
ఈ అవమానకర ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది
ముర్ము కూడా విస్మయం వ్యక్తం చేసారు. ‘‘పార్లమెంటు ఆవరణలో మన గౌరవ ఉపరాష్ట్రపతిని
అవమానించడాన్ని చూడలేకపోయాను. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని
స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. కానీ వారి భావ వ్యక్తీకరణ హుందాగా, గౌరవప్రదంగా ఉండాలి.
అదే మనకు గర్వకారణమైన పార్లమెంటరీ సంప్రదాయం. ఆ గౌరవ మర్యాదలను పాటించాలని ప్రజలు ఎంపీలను
కోరుతున్నారు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు.
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఈ ఉదయం ధన్‌ఖడ్‌ను
పరామర్శించారు. విపక్ష సభ్యుల తీరు అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష సభ్యుల
తీరును నిరసిస్తూ, ఛైర్మన్‌కు పట్ల తమ గౌరవాన్ని ప్రకటిస్తూ రాజ్యసభలో ఎన్డీయే సభ్యులు
ఇవాళ గంటసేపు నిలబడుతున్నారు.