Colorado court bars
Trump from Primary Ballot
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్
పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) కొలరాడో సుప్రీంకోర్టు షాకిచ్చింది. వచ్చే యేడాది
జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ
బ్యాలెట్‌కు (Primary Ballot) ట్రంప్ అనర్హుడని (Ineligibility) న్యాయస్థానం ప్రకటించింది. 2021 జనవరి 6న వైట్‌హౌస్
మీద దాడికి సంబంధించిన కేసులో ఈ తీర్పునిచ్చింది.
అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు
ముందుగా పార్టీ తరఫున అభ్యర్ధిగా ఎన్నికవ్వాలి. దానికి జరిగే పోటీనే ప్రైమరీ
బ్యాలెట్ అంటారు. రిపబ్లికన్ పార్టీ తరఫున దేశ అధ్యక్ష పదవికి రెండోసారి
అభ్యర్ధిగా నిలబడడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఈ తీర్పు ఆయనకు
పెద్ద దెబ్బే. అంతేకాదు, అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై కనీసం
ప్రైమరీల్లోనైనా పోటీ చేయడానికి అనర్హుడంటూ వేటు వేయడం అమెరికా చరిత్రలోనే
మొదటిసారి.
అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను
ప్రేరేపించడంలో ట్రంప్ పాత్రపై స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని కోర్టు చెప్పింది.
ప్రైమరీల్లో పోటీకి అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు 4-3 తేడాతో తీర్పునిచ్చింది.
ఆ తీర్పుపై అప్పీల్ చేసుకోడానికి 2024 జనవరి 4 వరకూ ట్రంప్‌కు గడువునిచ్చింది.
గతంలో కొలరాడో జిల్లా కోర్టు ప్రభుత్వ వ్యతిరేక హింసకు ట్రంప్ ప్రేరేపించినట్లు
ఒప్పుకుంటూనే, రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్ధిత్వంపై నిషేధం విధించడం అవసరంలేదని
తీర్పునిచ్చింది. అయితే దిగువ కోర్టు తీర్పును ఇప్పుడు కొలరాడో సుప్రీంకోర్టు
కొట్టేసింది.
ఈ తీర్పు ప్రభావం ట్రంప్‌పై భారీగానే
పడుతుంది. ఆయనకు అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుందుకు కొలరాడో కోర్టు
అవకాశం కల్పించింది. కానీ అక్కడ కూడా ఇదే తీర్పు వస్తే ట్రంప్‌కు చుక్కెదురైనట్లే.
అంతేకాదు. రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు మార్చి 5న జరుగుతాయి. ఆలోగా అమెరికా
సుప్రీంకోర్టు తీర్పు రాకపోతే ట్రంప్ పోటీ చేసే అవకాశం ఉండదు.
ట్రంప్ శిబిరం ఈ తీర్పును
తప్పుడు తీర్పు అనీ, అప్రజాస్వామికమనీ దుయ్యబట్టింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్
చేసుకుంటామనీ, అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ట్రంప్ తరఫు న్యాయవాది కొలరాడో సుప్రీంకోర్టుకు ట్రంప్‌ను ప్రైమరీ బ్యాలెట్‌కు
అనర్హుడు అని తీర్పునిచ్చే అధికారం లేదని వ్యాఖ్యానించారు.