RSS target is to double the Sakhas by centenary year 2025
భారతదేశాన్ని
విశ్వగురువుగా చేయాలన్న నిబద్ధతతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పనిచేస్తోందని సంఘం సహ సర్కార్యవాహ (Saha Sar Karyavaha) డా.కృష్ణగోపాల్ (Dr Krishna Gopal) చెప్పారు. దేశంలో జాతీయతావాదాన్ని (Nationalism) పెంపొందించేలా సంఘ శాఖలను 2025 నాటికి
రెట్టింపు చేయాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు.
రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థల సమన్వయ కమిటీ (RSS affiliated organizations’
coordination committee) రెండు రోజుల సమావేశం జమ్మూలో డిసెంబర్ 16, 17 తేదీల్లో జరిగింది. ఆ సందర్భంగా
మాట్లాడిన డా.కృష్ణగోపాల్, సంఘం 2025లో శతజయంతి జరుపుకుంటుందనీ, (RSS centenary year 2025) అప్పటికి దేశంలో సంఘ శాఖలను రెట్టింపు చేసేందుకు
ప్రయత్నిస్తున్నామనీ చెప్పారు.
సంఘ అనుబంధ
సంస్థలను ఉద్దేశించి ప్రసంగిస్తూ డా.కృష్ణగోపాల్ జమ్మూకశ్మీర్లో ప్రజల్లోకి
సంఘాన్ని తీసుకువెళ్ళే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేసారు.
జాతీయతావాదమే సంఘం విశ్వసించి ఆచరించే ప్రధానవిలువ అని స్పష్టం చేసారు. జాతీయతావాదం
విషయంలో సంఘం ఎన్నడూ రాజీపడలేదనీ, భవిష్యత్తులో కూడా అదే విధానంగా కొనసాగుతుందనీ
స్పష్టం చేసారు. బీజేపీ సహా 37 అనుబంధ సంస్థల నాయకుల నుంచి సమగ్ర నివేదికలు, ఫీడ్బ్యాక్
కోరారు. జమ్మూకశ్మీర్ కేంద్రపాలితప్రాంతంలోని ప్రతీ ఇంటికీ సంఘం సందేశం చేరడం
అత్యంత ఆవశ్యకమని ఆయన వివరించారు.
రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని డా.కృష్ణగోపాల్ గుర్తుచేసారు. ఈ
సందర్భంగా ఆయన ఉగ్రవాదంపై పోరులో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను
ప్రశంసించారు. జాతివ్యతిరేక శక్తులు ద్వేషమనే విషబీజాలు నాటడానికీ, విధ్వంసం
సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు. అలాంటి దుష్టశక్తులకు
వ్యతిరేకంగా నిలబడాలని జమ్మూకశ్మీర్ ప్రజలకు బలమైన సందేశం ఇవ్వడానికి సంఘ
కార్యకర్తలు మోదీ ప్రభుత్వ విధానాలను అనుసరించాలని సూచించారు. ఉగ్రవాదాన్ని
ఎదుర్కోడంలో మోదీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తున్నాయనీ, పొరుగు
దేశాల్లో సైతం గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయనీ ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్లో
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి పాకిస్తాన్ ప్రధాన కారణమని డా.కృష్ణగోపాల్
మండిపడ్డారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వల్ల కలిగే దుష్పరిణామాలను ఆ దేశం
ఇప్పుడు చవిచూస్తోందన్నారు. పాకిస్తాన్ శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందించిన ఉగ్రవాదులు
ఇప్పుడు ఆ దేశం మీదనే విరుచుకు పడుతున్నారనీ, ఫలితంగా పాక్ ఇప్పుడు అంతర్గత వివాదాల్లో
కూరుకుపోయిందనీ ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఇన్నాళ్ళ తన దుశ్చర్యలకు ఇప్పుడు ఫలితం
అనుభవిస్తోందన్నారు.
సహ సర్కార్యవాహ
డా.కృష్ణగోపాల్, సంఘ అనుబంధ సంస్థలతో వర్తమాన రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
దేశ ప్రజల్లో దేశభక్తి, జాతీయవాద భావనలను ప్రేరేపించాల్సిన అవసరాన్ని ఆయన
ప్రముఖంగా ప్రస్తావించారు.
సంఘం ఏ
మతానికీ, ఏ కులానికీ వ్యతిరేకం కాదని డా.కృష్ణగోపాల్ విస్పష్టంగా తేల్చిచెప్పారు.
అన్ని సామాజికవర్గాల మధ్యా సంబంధాలను బలోపేతం చేయడానికీ, తద్వారా దేశం
పురోభివృద్ధి, శాంతి సాధనకూ సంఘం కృషి చేస్తోందని వివరించారు.
‘‘భారతదేశాన్ని
విశ్వగురువును చేయడమే సంఘం ప్రధాన లక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం కూడా దానికి
కట్టుబడి ఉంది’’ అన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి దేశం మొత్తంమీద శాంతి
సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాల్సిన అవసరముందని స్పష్టం చేసారు.
‘‘భారతదేశంలో
హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు, ఇంకా చాలా మతాల వారు ఉన్నారు.
వారిలో అత్యధికులు దేశ ఐక్యత, సమగ్రతలను విశ్వసిస్తారు. భారతదేశపు సంస్కృతి,
సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మహాపురుషులను గౌరవించేవారితో సంఘానికి ఎలాంటి విభేదాలూ
లేవు. అయితే దేశ సంస్కృతికీ, విలువలకూ విఘాతం కలిగించే ప్రతీపశక్తులను సంఘం
ఎట్టిపరిస్థితుల్లోనూ సహించదు’’ అని డా.కృష్ణగోపాల్ స్పష్టం చేసారు.
1925లో స్థాపించినప్పటినుంచీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చారిత్రక ప్రయాణాన్ని సహ సర్కార్యవాహ ప్రముఖంగా
ప్రస్తావించారు. దేశం ఒడుదొడుకుల్లో ఉన్న సందర్భాల్లో, వాటి నుంచి దేశం బైటపడడంలో
సంఘం పోషించిన కీలక భూమికను వివరించారు. 8శతాబ్దాల విదేశీ ఆక్రమణలు, పరాయి
పాలనల్లో కోల్పోయిన అస్తిత్వాన్ని పునరుద్ధరించడం, దాన్ని కాపాడడంలో సంఘం పాత్రను
ఆయన కొనియాడారు.
డా.కృష్ణగోపాల్
భారతదేశపు ప్రగతి గురించి ఆశావాద దృక్పథాన్ని వ్యక్తం చేసారు. గత దశాబ్ద కాలంలో
దేశం శరవేగంతో పురోగమించడాన్ని గమనించారు. ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశం
అంతర్జాతీయ వేదికలపై ఘనకీర్తి గడించడం, శక్తివంతంగా నిలవడంపై హర్షం వ్యక్తం
చేసారు. భారత్ తాను కోల్పోయిన
కీర్తిప్రఖ్యాతులను సమీప భవిష్యత్తులోనే పొందగలదనీ, ప్రపంచ నాయకత్వం వహిస్తుందనీ ఆశాభావం
వ్యక్తం చేసారు.
రామజన్మభూమి
కలశయాత్రలో సంఘ అనుబంధ సంస్థలు విస్తృతంగా పాల్గొనాలని డా.కృష్ణగోపాల్
పిలుపునిచ్చారు. ఇంకా, త్వరలో రాబోయే లోక్సభ ఎన్నికలకు బీజేపీ సంసిద్ధత గురించి ఆ
పార్టీ నాయకులతో చర్చించారు. ఎన్నికలకు పార్టీ ఎంత సంసిద్ధంగా ఉందని నివేదికలు
సమర్పించమని వారికి సూచించారు.
ఈ
కార్యక్రమంలో సంఘానికి అనుబంధంగా ఉన్న 37 సంస్థల నాయకులు అందరూ పాల్గొన్నారు.
బీజేపీ తరఫున రవీందర్ రైనా, అశోక్ కౌల్, జుగల్ కిషోర్ శర్మ, డా.నిర్మల్ సింగ్,
కవీందర్ గుప్తా పాల్గొన్నారు. జాతీయతావాదం, దేశ పురోగతి అన్న ఉమ్మడి లక్ష్యాలను
సాధించడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని వారు సమర్ధించారు.