సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల ఇండీ కూటమి (INDIA Alliance) మరోసారి భేటీ అయింది.ఢిల్లీలోని అశోకా హోటల్లో విపక్షాలు ఈ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే మరికొందరు ముఖ్య నేతలు హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా చర్చించనున్నారు.
పలు ప్రాంతీయ పార్టీలతో ఇండీ కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్, మరికొన్ని పార్టీలతో పొత్తుల వ్యవహారం తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్, మరో మాజీ సీఎం భూపేశ్ బఘేల్, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ నేత మోహన్ ప్రకాశ్‌లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ కసరత్తు చేయనుంది.