Diamond Necklace made with
Ayodhya Ram Temple Theme
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న
రామమందిరం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఆ మందిరం నమూనా అందరినీ
ఆకట్టుకుంది. గుజరాత్ సూరత్‌లోని వజ్రాల వ్యాపారి ఒకరికి ఆ మందిరం కొత్త
ఆలోచననిచ్చింది. ఫలితంగా రామమందిరం నమూనాలో ఓ వజ్రాల హారం తయారయింది.
వజ్రాల నగరం సూరత్‌లోని రాసేష్ జువెల్స్ దుకాణం ఈ హారాన్ని తయారు చేసింది. ఆలయ నమూనాలోని హారం మాత్రమే కాదు,
సీతాలక్ష్మణహనుమాన్ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్బారుకు సైతం ఆకృతి కల్పించారు. వజ్రాలు
పొదిగిన బంగారు విగ్రహాలు తయారుచేసారు.
మందిరం నమూనాలోని హారాన్నీ, సీతా రామ లక్ష్మణ
ఆంజనేయుల విగ్రహాలనూ తయారుచేయడానికి రెండు కిలోగ్రాముల వెండి, 5వేలకు పైగా
అమెరికన్ డైమండ్స్, బంగారం ఉపయోగించారు. ఆ హారాన్నీ, రామదర్బారునూ అయోధ్యలో నిర్మిస్తున్న
బాలరాముడి మందిరానికి కానుకగా ఇవ్వాలని ఆ దుకాణదారు భావిస్తున్నారు.
రాసేష్ జువెల్స్ డైరెక్టర్ కౌశిక్
కాకడియా ‘‘ఈ హారం తయారీలో 5వేలకు పైగా వజ్రాలు, 2కిలోగ్రాముల వెండి ఉపయోగించాం.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరమే మాకు ప్రేరణ. మేం దీన్ని వ్యాపార
దృక్పథంతో తయారు చేయలేదు. మేము దీన్ని అయోధ్య రామాలయానికి కానుకగా ఇస్తాము.
రామమందిరానికి మా వంతుగా ఏం చేయాలా అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది.
వజ్రాల హారంలో రామాయణంలోని ప్రధాన పాత్రలన్నింటినీ చెక్కాము’’ అని చెప్పారు.
40మంది కళాకారులు 35రోజులు పరిశ్రమించి ఈ
అయోధ్య రామమందిర హారాన్ని రూపొందించారు.