విశాఖపట్నంతో
భారతీయ జనతా పార్టీకి మంచి అనుబంధం ఉందన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు
పురందరేశ్వరి, ఉక్కునగరం అభివృద్ధిలో బీజేపీ కీలకపాత్ర పోషించిందన్నారు. బీజేపీ నేతలే విశాఖ రాజకీయ వారసులని భాష్యం
చెప్పారు.
విశాఖ మేయర్ గా పనిచేసిన ఎన్ఎస్ఎన్
రెడ్డి బీజేపీ నుంచే ప్రాతినిధ్యం
వహించారని గుర్తు చేశారు. వాజ్ పేయ్ ప్రధాని గా ఉన్న సమయంలో ఉక్కునగరం అభివృద్ధికి
అందించిన సహకారం మరువలేనిదన్నారు.
విశాఖలో
పర్యటిస్తున్న పురందరేశ్వరి, కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో జరుగుతున్న అభివృద్ధి
పనులను పరిశీలించారు. 400 పడకలతో నిర్మించే ఈఎస్ఐ ఆస్పత్రి స్థలాన్ని సందర్శించి
పనుల పురోగతిపై అధికారులను వివరణ కోరారు. గత, ప్రస్తుత రాష్ట్రప్రభుత్వాల నుంచి
సహకారం కొరవడటంతోనే పనులు ముందుకు సాగడం లేదన్నారు.
పేదలను
దగా చేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతోందని విమర్శించిన పురందరేశ్వరి,
రుషికొండను బోడికొండగా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పేదలకు
ఇళ్ళ పేరుతో టిడ్కో నుంచి ప్రభుత్వం రుణం తీసుకుంటే లబ్ధిదారులకు బ్యాంకులు
నోటీసులు ఇస్తున్నాయన్నారు. పేదలకు బీజేపీ అండగా నిలుస్తోందని వారి అభ్యున్నతి
కోసం కేంద్రప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
రైల్వే
జోన్ కు స్థలం కేటాయించడంలో వైసీపీ ప్రభత్వం తాత్సార్యం చేసిందని సదరు వైఫల్యాన్నిబీజేపీ
పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో జరిగే పురోగతిని స్థానికులకు వివరించడంతో పాటు పార్టీని సంస్థాగతంగా
బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పురందరేశ్వరి చెప్పారు.
విశాఖ
ట్రాఫిక్ సమస్యకు పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం చొరవచూపడం లేదన్నారు. మెట్రో
నిర్మాణానికి డీపీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీజేపీ
నేతల పర్యటనలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణు కుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ , పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.