పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హో మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు ఇవాళ కూడా లోక్‌సభలో ఆందోళనకు దిగాయి. విపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. దీంతో విపక్ష సభ్యులపై మరోసారి వేటు (loksabha suspensions) పడింది. మంగళవారం 49 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
సభాపతి ఆదేశాలు దిక్కరించి, సభ కార్యకలాపాలకు అడ్డుపడుతోన్న సభ్యులను సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు మూజువాణీ ఓటుతో ఆమోదించారు. దీంతో స్పీకర్ తాజాగా 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు.
విపక్ష ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి ధరూర్, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, మనీశ్ తివారీ సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉణ్నారు. సభలోకి ఫ్లకార్డులు తీసుకు రాకూడదనే నిబందన ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే ఇలా చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నిరాశలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు.
లోక్‌సభలో గత గురువారం 13 మందిని, సోమవారం 33 మందిని, మంగళవారం 49 మందిని సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు శీతాకాల సమావేశాల్లో ఒక్క లోక్‌సభలోనే 95 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఇక రాజ్యసభలో 46 మందిని సస్పెండ్ చేశారు. ఉభయసభలో శీతాకాల సమావేశాల్లోనే 141 మందిపై వేటు పడింది. సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి.