విపక్షాల
తీరును ప్రధాని మోదీ మరోసారి తూర్పార బట్టారు. దేశ ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పాలనసాగిస్తుంటే, విపక్షాలు మాత్రం
ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కూటమి కట్టాయని ఆరోపించారు.
దిల్లీలో
జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఇండీ కూటమిపై తీవ్ర
విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాలూకా నిస్పృహను కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను వెంటాడుతుందని
దానిని పార్లమెంటు సమావేశాల్లో వెల్లగక్కుతున్నారని దుయ్యబట్టారు.
విపక్షాలు
అనుసరిస్తున్న తీరుతో ఇండీకూటమికి రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీట్ల సంఖ్య మరింత
పడిపోతుందని, ఎన్డీయే కూటమి బలం మరింత పెరుగుతుందన్నారు.
పార్లమెంటు
భద్రతా వైఫల్యం ఘటనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయమన్నారు.
ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన ఘటన గురించి
ప్రతిపక్షాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ, ఎంపీలకు
చేసిన దిశానిర్దేశం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఆరోపణల విషయంలో ఎంపీలు మర్యాదపూర్వకంగా స్పందించాలని
పార్లమెంటు సభ్యులకు సూచించారన్నారు.