Tamil Nadu Rain
Fury:
తమిళనాడులో
జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దక్షిణ తమిళనాడులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా
నానా అవస్థలు పడుతున్నారు. భారత వాయుసేన, ఆర్మీ సహా ఇతర విపత్తు దళాలు సహాయ కార్యక్రమాల్లో
నిమగ్నమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతిచెందారు.
వందలాది మంది పరిస్థితి
ఆగమ్య గోచరంగా మారింది. నేడు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని
భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తమిళులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా
దెబ్బతింది. రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు
గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు.
తూత్తుకుడి జిల్లాలోని శ్రీ వైకుంఠం రైల్వే
స్టేషన్ లో 24 గంటలుగా 500 మంది ప్రయాణికులు చిక్కుకుపోయి దిక్కు తోచని
పరిస్థితిలో ఉన్నారు. స్టేషన్ లో ఉండలేక అక్కడి నుంచి బయటపడలేక సహాయ కోసం ఎదురు
చూస్తున్నారు. దీంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది. వారిని వాయుమార్గంలో
తరలించేందుకు సిద్ధమవుతోంది.
తూత్తుకుడి జిల్లా పరిధిలోని రైల్వే
ట్రాకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో కేవలం సిమెంటు స్లీపర్లు
వేలాడుతున్నాయి. దీంతో రైలు ప్రయాణం తీవ్ర ప్రమాదకరంగా తయారైంది.
వాసవప్పపురం
ప్రాంతంలో చిక్కుకుపోయిన 118 మందిని భారత సైన్యం రక్షించింది. వారికి పునరావాస
కేంద్రాలకు తరలించారు.
దక్షిణ తమిళనాడు ప్రాంతంలోని 7,500
మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. పరిస్థితిని వివరించేందుకు ప్రధాని అపాయింట్మెంట్
కోరుతూ ప్రధాని మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. వరద ప్రభావిత
ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.