ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి : 2
మంచి వెన్నెల వేళ : ‘‘పాలొద్దూ…
నెయ్యొద్దూ…’’ : కాత్యాయనీ వ్రతం – 2
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
యమున తన నలుపుని కడిగేసుకుందామని
రాత్రంతా వెన్నెలని తాగుతోంది. చాలా సేపు దాని తాపత్రయం గమనించిన చందమామ పకపకా
నవ్వాడు. “నల్లని నీలో మునకలు వేస్తూ, నల్లనయ్య కౌగిట్లో ఉన్నామని ఊహించుకుంటున్నారా
గొల్లపిల్లలు. నువ్వేమో తెల్లబడిపోదామని ప్రయత్నిస్తున్నావ్! పొరుగింటి పుల్లకూర
నీకెందుకు యమునమ్మా…? నలుపు నారాయణుడు మెచ్చు!” అని హితవు పలికాడు. మూతి ముడిచి
విసవిసా పరుగులు తీసింది యమున. ఒక్క క్షణం ఆలోచించి “నిజమే!” అనిపించి
తనను తను చూసుకుని గర్వంగా తరగల ముసినవ్వులు నవ్వుకుంది.
రేపల్లెలో ఓ పడతి కళ్ళాపి జల్లుతోంది.
ప్రతి ఉదయం ముంగిట్లో తను చిత్రించే రంగవల్లికకి చిత్రపటాన్ని సిధ్ధం చేసుకున్ననంత
శ్రధ్ధగా, ముంగిట్లో నేలను సమాయత్తం చేసుకోవడం ఆ పిల్లకి మహా ఇష్టం. పటం
సిధ్ధమయింది. ఆమె ఉపయోగించేది ధవళ వర్ణమొక్కటే. నూకలు తిరగట్లో విసిరి మెత్తని
తెలతెల్లని బియ్యపు పిండిని పదిరోజులకోమాటు సిధ్ధం చేసుకుంటుంది. ఊళ్ళో
ఆడపిల్లలందరూ తెల్లవారాక ఏదో నెపంతో ఆ ముంగిలి ముందు నుంచి వెళ్తారు. “తరళ ఈ
రోజు పన్నెండు పద్మాల ముగ్గు వేస్తుందా…? పన్నీరు బుడ్డి మెలికల ముగ్గు వేస్తుందా…
ఆడే నెమలి బొమ్మ వేస్తుందా!” అని ముందే పందాలు వేసుకుంటారు. అంత గొప్ప
చిత్రకారిణి ఆమె!
కృష్ణుడు కూడా ఓ నాడు ఆమె వేసిన
పద్మవల్లికను చూసి మెచ్చుకున్నాడు. ఆ సాయంత్రం కడిమి మొదట మురళి మ్రోగిస్తున్న
ఆతని వద్దకు చేరిన గోపికల్లోంచి, ప్రత్యేకం తరళను పిలిచి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని “మృదు పాణీ… నువ్వు భలే చిత్రాలు గీస్తావు సుమా! ముంగిట్లో
ముగ్గులేనా… నా బొమ్మ గీసేదేమైనా ఉందా!?” అని మేలమాడుతూ
అడిగాడు కూడా! కన్నయ్య అడగడమూ, తరళ కాదనడమూనా! ఆనాటి నుండీ కృష్ణుడి బొమ్మ గీసేందుకు కుంచె
పట్టుకోవడం, రంగుల మిశ్రమం కుదరక ఓ సారీ, అసలు కుంచే కదలక ఓ సారీ, అంతా గీసాక ఏ
ముంగురులో సరిగ్గా కుదరలేదనో, కళ్ళు బాగా రాలేదనో ఆ చిత్రం పక్కన పెట్టడం ఆ అమ్మాయికి నిత్యం ఓ పని.
ప్రయత్నం మానలేదు, మానదు. అయితే ముంగిట్లో ముగ్గు మాత్రం గొప్ప యాగం చేస్తున్నంత
శ్రధ్ధతో, దీక్షతో గీస్తుంది. “ఆ వీధిలో ఏ పని ఉండి అటుగా వచ్చి తన ముగ్గు
చూస్తాడో!” అనే ఊహే ఆమె చేత చిత్రమైన అల్లికలు అల్లిస్తుంది. తెల్లని
వరిపిండితో ఆమె గీసిన ముగ్గులో ఒక పద్మం మాత్రం రోజూ ఉండి తీరుతుంది. కృష్ణుడు
మెచ్చుకున్నది ఆ పద్మాన్ని చూసేగా! తెలవారాక పిచుకలు ఆ పద్మపు
అంచున వాలి మధ్యలో ఒత్తుగా ఉన్న పిండిని పొడుచుకు తింటూ ఉంటాయి. చీమలూ ఇతర కీటకాలూ
సరే సరి!
కాత్యాయనీ వ్రతం మొదలు పెట్టిన నిన్నటి
నుంచీ మాత్రం మెలికల ముగ్గులు వెయ్యడం మానేసింది. గీతల్లోనే ముగ్గులన్నీ. పిండి
గుప్పిట బిగించి వేళ్ళ సందుల్లోంచి రెండేసి గీతలు పడేలా, దీక్షగా గీతలు
గీసుకుపోతోంది. ఆమెను నిద్ర లేపడానికి వచ్చిన మిగిలిన మిగతా అమ్మాయిలందరూ ఆమె
వేళ్ళలోంచి నక్షత్రాల పొడి లా ఆ పిండి జారుతూ నేలమీద ఆకృతి సంతరించుకుంటున్న వైనం
అబ్బురంగా చూస్తూ నిలబడిపోయారు. చతురస్రాకారంలో బ్రహ్మాండమైన వైకుంఠ ద్వారాల
ముగ్గు వేసేసి తృప్తిగా చూస్తూ, ఎందుకో తల వెనక్కి తిప్పి చూసింది. మంత్ర ముగ్ధల్లా తన నేస్తాలందరూ “రెప్పలు వేసీ, ఊపిరి పీల్చీ కూడా
సడి చెయ్యకూడదు” అన్నట్టు నిలబడి ఉన్నారు.
“అయ్యో, వేళ మించిపోతోందా… అందరూ వచ్చేసారే! మనం వచ్చేసరికి తెలవారిపోతుందనీ…
ముగ్గు వేసేద్దామనీ…” సంజాయిషీ చెప్తున్న స్వరంలో చెప్పింది. మౌనంగా
ముందుకు కదిలిన ఉత్పల తరళ చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకుని ముద్దు
పెట్టుకుంది. కన్నయ్య మెచ్చిన చేతులవి! ఆయన మెచ్చిన ముగ్గులవి!! వైకుంఠ ద్వారాన్ని
కళ్ళెదుట నిలిపిన నేర్పరితనం ఆ చేతుల సొత్తు మరి!!
“ఏవిటర్రా!” అని అయోమయంగా అడిగింది తరళ.
వాతావరణాన్ని తేలిక చేసేందుకు “ఇదిగో తరళా…
“నువ్వు గీసిన ఈ ద్వారం వెనుకే పాల కడలీ, శేష శయ్యా
ఉన్నాయేమో!” అని లక్ష్మి పరిగెట్టుకొస్తుంది మీ ఇంటికి! ఈనాటి వరకూ పద్మాల
కోసమే సిరి మీ ఇంటి దారి విడువదని అనుకునే వాళ్ళం. ఈ రోజు వైకుంఠ ద్వారాలే
గీసేసావే!!” అని నవ్వింది సురభి.
“వైకుంఠ ద్వారాలంటే ఇంకో నాలుగు కమ్మలూ, ఆ ఉత్తర ద్వారం
వైపు మరో రెండు వంపులూ ఎక్కువ పడతాయ్లెండే! ఇది దాదాపు అలాంటిది. ఏదో నా
బుర్రకి తోచినది. పోన్లెండి! ఉదయాన్నే పాలకడలిలో వెలిగే హరి పాదాలను తలుచుకున్నాం!
ఎంత మంచి రోజు!” అందరూ ప్రశంసించేసరికి సిగ్గుగా నవ్వుతూ చెప్పింది తరళ.
“అవును. పాల సంద్రంలో, పాము సెజ్జ పైన
యోగనిద్రలో ఉండే పరమాత్మని తలచుకోవడమే ఎంత గొప్ప విషయం! మీరు
విన్నారర్రా! హరి పాదాలు బహు సుకుమారమట. ఎరనెర్రని తామరపువ్వుల్లా ఉంటాయట! ఆ
పాదాల్లో శంఖ, రధాంగ, కల్పక,ధ్వజ, అరవింద, వజ్ర, అంకుశ… మొదలైన ఉత్తమ చిహ్నాలు ఉంటాయట. పసివాడు తల్లిరొమ్ము వెతుక్కున్నంత సులువుగా
నిజమైన భక్తుడు ఆ పాదాలను చేరుకోగలడట! ఆయన పాదాలను మించిన దిక్కేది!?” చేతులెత్తి
నమస్కారం చేస్తూ చెప్పింది ఉత్పల.ఇందాకా భక్తితో కలిగిన గగుర్పాటు ఇంకా ఉత్పల ఒంటిని
వదల్లేదు.
“నిజంగా నిజం!! సరే, సరే పదండి. ఇంకా
సమయం ఉంది కానీ, పువ్వులు కోసుకోవాలి కదా ఇంకా…” బయలుదేరింది కమలిని.
అందరూ పూలతోటలోకి వెళ్ళి తుమ్మెద
కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివీ, రకరకమ్ముల వన్నెలవీ, దివ్య పరిమళాలు వెదజల్లేవీ… బోలెడు పువ్వులు కోసుకుని యమున ఒడ్డుకి
చేరారు. పూజా ద్రవ్యాలూ, పువ్వులూ ఓ పక్కన పెట్టి నదిలో దిగి “హరి హరీ!” అంటూ మూడు మునకలేసి వచ్చారు. “కాత్యాయని ప్రతిమ”ని సురభి, ఉత్పలా
చేస్తున్నారు. కమలిని, మేదినీ వంటకి సిధ్ధపడుతున్నారు. పువ్వుల మాలలు అల్లుతున్న తరళా, విష్ణుప్రియా
గోవిందనామాలు వల్లెవేస్తున్నారు. విష్ణుప్రియకి పువ్వుల మాలలు అల్లడమంటే చాలా
ఇష్టం. అందుకని “రోజూ ఆ పని తనదే!” అని ముందే చెప్పుకుంది.
కాస్త దూరంలో పూజకు సిధ్ధం చేస్తున్న
ఆనందినిని అడిగి తనకి కలిగిన సందేహాలు తీర్చుకుందామనుకుంది విష్ణుప్రియ. ఆనందిని
మునిపల్లెకి తరచూ వెళ్ళి పురాణాలూ, ధర్మ శాస్త్రాలూ నేర్చుకు వస్తూ ఉంటుంది. ఆమెకి చాలా విషయాలు తెలుసని
అందరూ అనుకుంటూ ఉంటారు.
“ఆనందినీ, కాత్యాయనీ వ్రతానికి ఇంత కఠిన నియమాలెందుకూ! ఆడపిల్లలకి కాటుకా, పువ్వులూ ప్రీతి
పాత్రమైనవి కదా! నాకయితే పువ్వులు ముడవని రోజు తోచదు. అలాంటిది నెల రోజులు
పువ్వులు పెట్టుకోకూడదంటే కారణమేమై ఉంటుంది?”
“విష్ణువు లాగే విష్ణుప్రియా అలంకారప్రియ! చెప్పు
చెప్పు. ఎందుకు?” నవ్వింది తరళ.
“కాదులేవే తరళా! అలంకారాలు ఇష్టం
లేని ఆడపిల్లెవరు చెప్పు! పరీక్షకి తట్టుకునే తత్వం మనిషిలో పెంపొందించడమే ఏ
వ్రతంలో అయినా ముఖ్య ఉద్దేశ్యం. కాటుక,
పువ్వులూ కాదని మరీ వ్రతాన్ని చెయ్యగలిగావే అనుకో…
ఇష్టమైన వస్తువు ఏదైనా కారణం వల్ల దొరకకపోయినా, విలాసాలు లేకుండా కూడా నువ్వు గడపగలవు అనే నమ్మకం నీపై నీకే కలగదూ!
అందుకన్నమాట. ఇంక ఈ నెల్లాళ్ళూ పాలూ,
నెయ్యి కూడదని చెప్తారు కదా! అదీ ఇలాంటిదే!
చలికాలం కదా… కఫతత్వాన్ని పెంపు చేసి ఏ జబ్బైనా చేస్తుందేమో అని వద్దంటారేమో
కూడా!”
“ఆడపిల్లలం… అయినా ఈ నెల్లాళ్ళూ కాటుకా, పువ్వులూ కూడదు.
గొల్ల పిల్లలం… కానీ పాలు నెయ్యీ కూడదు. ఇంత కంటే పరీక్ష మరోటి ఉంటుందా!”
వాపోయింది విష్ణుప్రియ.
“రెండో రోజుకే! ఆదిలోనే హంసపాదు వేస్తున్నావ్, పిల్లా!”
సురభి అటుగా వస్తూ ఆటపట్టించింది.
“అబ్బే! ఏం లేదు. ఊరికే తెలుసుకుందామనీ!”
ఉడుక్కుంది విష్ణుప్రియ.
“నీకింకా చెప్తాను. విను. దురుసు మాటలు
మాట్లాడకూడదు. మనస్పూర్తిగా దాన ధర్మాలు చెయ్యాలి… రోజుకు రెండు సార్లు ఓ గంట
సేఫు ఊపిరి బిగపట్టి యమునలో మునిగి ఉండాలి.”
“నిజమా!!!!”
“నమ్మేసి చేసేసేలా ఉన్నావ్ కన్నయ్య కోసం! నీతో
పరిహాసాలాడకుడదు తల్లీ! అన్నీ నిజమే,
యమునలో ముక్కుమూసుకు నిలబడడం తప్ప.”
“నువ్వు మాత్రం ఇలా వేళాకోళాలు ఆడవచ్చునేం!”
ఉడుకుమోతుతనం విష్ణుప్రియకి పెట్టని నగ.
“మరీ వీసానికి వీగిపోతావ్ పిల్లా! ఊరికే
అన్నానులే. మనసులో పెట్టుకోకు. ఇక నిన్ను ఏడిపించనులే.” నవ్వేసింది సురభి.
“మరి మనకి తెలియక తప్పులు చేస్తేనో?” కమలిని
వచ్చి కూర్చుంటూ అడిగింది. ఆనందిని చెప్పసాగింది.
“తప్పు లేనివారు భూమిపై లేరని సీతమ్మే చెప్పింది
తెలుసా! లంకలో అశోక వనంలో తన చుట్టూ చేరి మాటలతో ఆమెను హింసించిన రాక్షస స్త్రీలని “నువ్వు ఊ అని ఒక్క మాట అను తల్లీ! ఈ రక్కసి మూకని చంపి
పారేస్తానని” హనుమ అంటే…”
“ఊ… అంటే…”
“దయ చూపించవయ్యా! తప్పు చెయ్యని వారు లోకంలో ఎవరు!?” అని చల్లని నీళ్ళతో నిప్పుని ఆర్పినట్టు హనుమంతుల వారి కోపాన్ని
శమింపచేసిందన్నమాట.” చెప్పింది ఆనందిని. క్షణమాగి మళ్ళీ చెప్పనారంభించింది.
“పోనీ,
తెలియక తప్పే చేసామనుకో… “అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ” అంటే
అన్ని ప్రాణుల రక్షణా నా బాధ్యత, వ్రతమూను అని చెప్పిన రాముడున్నాడు మనకు. మనం చెయ్యాల్సిందల్లా మన పని
త్రికరణ శుధ్ధిగా మనం చెయ్యడమూ, తెలియక చేసిన తప్పులను మన్నించమనీ, నువ్వే శరణనీ
పరమాత్మను నమ్మడమూను. నొప్పి కలిగితే ‘బాబోయ్…ఈ బాధ పగవాడిక్కూడా వద్దని‘ ఏదో మాట వరసకి
అంటాం కానీ, పగవాడొస్తే ఆదరిస్తామా చెప్పు! లేదు. మరి రాముడో, విభీషణుడు శరణంటే
కాచాడా లేదా…!”
“ఊ… రాజ్యం గెలిచి ఇచ్చాడు.”
“కాబట్టి మన పని మనం చేస్తే చాలు. పాలూ, నెయ్యీ లేదని బెంగ
పెట్టుకోకు చిన్నారీ! పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. నీకేం
కావాలన్నా “కృష్ణా” అనుకో. కన్నయ్యే మనకి చద్దిమూట.”
“రామాయణం లోంచి రేపల్లెలోకి వచ్చేసావా! ఎంత మాటకారివి ఆనందినీ!”
మెచ్చుకోలుగా అంది కమలిని. అవునన్నట్టు తలలూపి నవ్వారందరూ.
“మళ్ళీ రామాయణంలోకి వెళ్ళానని అనుకోనంటే ఒక్క
మాట!”
“అయ్యో! భలేదానివే! నువ్వు చెప్పడమే
మాక్కావలసింది. చెప్పు చెప్పు”
“వనవాసానికి అన్నవెంట బయలుదేరిన
లక్ష్మణుడితో వాళ్ళమ్మ సుమిత్ర చెప్పిందిటా…”
“ఊ…”
“రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా!
అయోధ్యాం అటవీం విద్ధి గచ్ఛ తాత యథా సుఖం” అంటే…
“రామన్నని దశరథుడనుకో. జానకిని మీ అమ్మని నేనే అనుకో. అడవులే నీకు అయోధ్య.
ఇక్కడున్నంత సుఖంగా రాముడెక్కడుంటే అక్కడే ఉండు, తండ్రీ!” అని
చెప్పి తన బంగారు తండ్రిని అన్న వెంట అడవులకి పంపిందట ఆ తల్లి.”
కలువల్లా విచ్చిన వాళ్ళందరి కళ్ళలోనూ మంచు
ముత్యాల్లా కన్నీళ్ళు. కరిగించనిది కథ కాదు… రామకథ అసలే కాదు.
“ఇదిగో,
మీరందరూ ఇలా బేలమొహాలేసుకు చూస్తారనే నేను రాముడి
కథలు చెప్పను.” నొచ్చుకుంటూ ఆపేసింది ఆనందిని.
“లేదు లేదు. చెప్పు” ఏకకంఠంతో అన్నారందరూ!
“అలాగే మనకి రేపల్లే వైకుంఠం. యమున పాల కడలీ, కృష్ణుడే పరమాత్మ.
అతని కోసం కఠిన నియమాల కారడవుల్లో అయినా మల్లెపూల దారిలో నడిచినట్టు మనమూ
నడిచేద్దాం. ఏమంటారు!?”
“నువ్వింతలా చెప్పాక కూడా మళ్ళీ నియమాలు కష్టమని
అంటామా! ఈ నెల రోజులు నల్లేరు మీద బండి నడక. కృష్ణుడి కోసం కదా!” స్థిరంగా
పలికింది విష్ణుప్రియ.
ఔనంటే ఔనని అందరూ పూజ పూర్తి
చేసుకున్నారు. “సైకత కాత్యాయని” దీపకళికల వెలుగులో మెరుస్తోంది.
చీకటి కరిగి దినకరుడి తేరు కదులుతోంది. యమున గలగలల నేపధ్య సంగీతంలో కమలిని, ఆనందిని, విష్ణుప్రియ కలిసి
ఆలపించసాగారు. “పంతువరాళి!” సురభి వాళ్ళు పాడుతున్న రాగం పేరు ఉత్పలతో చెప్పింది.
వినరమ్మ వినరమ్మ మన నోము తీరు
పని బూని చేసిన మన సిరులు మీరు
అల పాల కడలి ఊయెల శేష శయ్యపై
అలవోక నిదురించు హరి శ్రీపదాబ్జాల
తలచుకొనుచు, సారె కొలుచుకొనుచు
తొలివేగుబోక నీరాడవలె చెలులార!
వలదు క్రోలగ పాలు, వలదు త్రావగ నేయి!
వలదు కాటుక పూత మన కన్నుదోయి!
అలరులు కైసేయ వలదు క్రొమ్ముడులలో!
లలనలారా! నోము నోచిన దినాలలో!
పరమాత్ముడౌ ప్రభువు సరస, పరులపై
దురుసు మాటలు నోట తొడగరాదమ్మ!
దరియనీదు ఘనులొల్లని పనులను!
జరుపవలెను ముదమున దానధర్మములను!
వినరమ్మ వినరమ్మ మన నోము తీరు…
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత…)
*ఇంకొన్ని కబుర్లు రేపు*
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య ప్రణీత “శ్రీమదాంధ్ర
భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము” ఆధారంగా…
తగుమాత్రం కల్పన జోడించి…)