పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ విపక్ష సభ్యుల తీవ్ర నిరసనలతో లోక్‌సభ, రాజ్యసభల్లో ( loksabha rajyasabha suspensions) కార్యకలాపాలు నిలిచిపోయాయి. లోక్‌సభలో ఆందోళన చేస్తోన్న విపక్ష ఎంపీలపై స్పీకర్ ఓం బిర్లా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
33 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. విపక్ష ఎంపీలు జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్ స్పీకర్ పోడియం ఎక్కి నినాదాలు చేశారు. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధరి, గౌరవ్ గొగోయ్, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్.బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్, కల్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్, శతాబ్ది రాయ్ ఉన్నారు. స్పీకర్ ఆదేశాలు దిక్కరించిన వారిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
రాజ్యసభలో 45 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. సస్పెండైన వారిలో జైరాం రమేష్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ సహా పలు పార్టీల ఎంపీలున్నారు. రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్‌పై శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
లోక్‌సభ కార్యక్రమాలకు అడ్డురావడంతో ఇప్పటికే 14 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. గత గురువారం 13 మంది ఎంపీలపై వేటు పడింది. మొత్తం ఈ సమావేశాల్లో ఇప్పటి వరకు 92 మందిపై సస్పెన్షన్ వేటు పడింది.
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ఇవాళ కూడా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనతో సభ రేపటికి వాయిదా పడింది.