నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ చిన్న ఇంటిని కాజేసేందుకు ఓ దుర్మార్గుడు ఆరుగురి నిండు ప్రాణాలు బలిగొన్నాడు. వారం వ్యవధిలో ఆరుగురిని చంపేసిన ప్రశాంత్ అనే నీచున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 9 నుంచి వారం రోజుల్లోనే ఆరుగురుని పొట్టనబెట్టుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మాట్లూరుకు చెందిన మాక్లూర్ ప్రసాద్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. డిచ్పల్లి హైవే వద్ద ప్రసాద్ మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్ భార్యను, బాసర వద్ద గోదావరిలో తోసేశాడని తెలుస్తోంది. వారి పిల్లలను పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలో నెట్టాశాడని పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు ప్రశాంత్, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ ఇద్దరి చెల్లెల్లను కూడా ప్రశాంత్ హత్య చేశాడు. అతనికి సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసుల గాలిస్తున్నారు.