ASI submitted report on Gyanvapi survey to court
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)
ఇవాళ జ్ఞానవాపి సర్వే నివేదికను (Gyanvapi Survey Report) వారణాసిలోని జిల్లా కోర్టుకు అందజేసింది. ఏఎస్ఐ తన నివేదికను తెల్లని
వస్త్రంలో సీల్ చేసి న్యాయస్థానానికి అందజేసింది. ఆ కేసు విచారణ గురువారం
జరగనుంది.
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలని
వారణాసి న్యాయస్థానం (Varanasi
Court) ఏఎస్ఐని ఆదేశించింది. 17వ శతాబ్దం నాటి ఆ మసీదును
అంతకుముందే అక్కడున్న శివాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద నిర్మించారా అన్న
విషయాన్ని తెలుసుకోడానికి ఆ సర్వే చేపట్టాలని న్యాయస్థానం పురావస్తు సర్వేక్షణ
సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారణాసి న్యాయస్థానం ఆదేశాలను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి
మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును (Allahabad
Highcourt) ఆశ్రయించింది. అయితే అలహాబాద్ హైకోర్టు
సైతం వారణాసి కోర్టు ఆదేశాలను సమర్ధించింది. ‘అసలైన న్యాయం జరగడం కోసం సర్వే
చేపట్టడం అవసరమే’నని హైకోర్టు వ్యాఖ్యానించింది. సత్యం తెలుసుకోవడం ఇరు పక్షాలకూ
మంచిదేనని హైకోర్టు అభిప్రాయపడింది.
హైకోర్టు ఆదేశాలను సైతం అంగీకరించని
జ్ఞానవాపి మసీదు కమిటీ (Gyanvapi
Masjid Committee) సుప్రీంకోర్టు
తలుపు తట్టింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
అయితే, సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ (Supreme Court Bench) ఏఎస్ఐని మసీదు ఆవరణలో ఎలాంటి తవ్వకాలూ జరపవద్దని ఆదేశించింది.
నిజానికి వారణాసి జిల్లా కోర్టు అక్కడ
అవసరమైతే తవ్వకాలు జరపవచ్చునంటూ ఏఎస్ఐకి అనుమతి మంజూరు చేసింది. కానీ మసీదు
యాజమాన్యం దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 354 ఏళ్ళ పురాతనమైన మసీదులోపల
బేస్మెంట్లోనూ, మరికొన్ని చోట్లా ఎలాంటి అనుమతులూ లేకుండా తవ్వకాలు జరపడానికి
ఏఎస్ఐ సిద్ధమైపోయిందంటూ సుప్రీంకోర్టులో వాపోయింది. అలాంటి తవ్వకాల వల్ల పురాతనమైన
మసీదు భవనం కూలిపోయే ప్రమాదముందని వాదించింది.
ఆ మేరకు ఏఎస్ఐ ఈ యేడాది ఆగస్టు నెలలో
జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే పనులు మొదలుపెట్టింది. అయితే సర్వే ఫలితాలను నివేదిక
రూపంలో సమర్పించడానికి ముందు కోర్టును ఆరుసార్లు గడువు పొడిగింపు అడిగింది. నవంబర్
2 నాటికి సర్వే పనులు పూర్తయ్యాయి. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి, విశ్లేషించి
నివేదిక రూపొందించడానికి సమయం పడుతుందని కోర్టును ఏఎస్ఐ అనుమతి కోరింది.
భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ,
జ్ఞానవాపి మసీదులో తాము చేపట్టిన సర్వే నివేదికను సీల్ చేసి ఇవాళ వారణాసి జిల్లా
న్యాయస్థానానికి అందజేసింది. (ASI
submitted sealed reportto court) ఆ నివేదికను బహిరంగపరుస్తారా, లేక పిటిషనర్లతో కానీ ప్రతివాదులతో కానీ
పంచుకుంటారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.