పార్లమెంటులో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తు వేగం (crime news) అందుకుంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడితో లింకులున్న ఆరు రాష్ట్రాలకు 50 బృందాలను పంపారు. నిందితుల వివరాలన్నీ సేకరిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేస్తున్నారు.
పార్లమెంటులో అలజడికి ప్రధాన సూత్రధారైన లలిత్ ఝూ ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు వెలికితీశారు. అతను రాజస్థాన్‌లో దహనం చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. లలిత్ ఘటన జరిగిన తరవాత ఢిల్లీ నుంచి రాజస్థాన్ పారిపోయాడు. తరవాత స్వయంగా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే విజిటర్స్ పాసులతో ప్రవేశించి గ్యాలరీల్లోంచి సభలోకి దూకి ఇద్దరు వ్యక్తులు అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగిన అమోల్ శిందే, నీలమ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కుట్ర వెనుక ఉద్దేశాలను కనుగొనేందుకు దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం చేశాయి.