Italy PM says Islam and
Europe have compatibility problem
ఇస్లామిక్ విధానాలకూ, ఐరోపా నాగరికత
అనుసరించే విలువలకు, హక్కులకూ ఎంతమాత్రం పొంతన కుదరదని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా
మెలోనీ (Giorgia Meloni) వ్యాఖ్యానించారు. ఇటలీలోని సంప్రదాయిక జాతీయవాద బ్రదర్స్ ఆఫ్ ఇటలీ
పార్టీకి చెందిన జార్జియా మెలోనీ, తమ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ
వ్యాఖ్యలు చేసారు. ఆ కార్యక్రమానికి బ్రిటిష్ ప్రధానమంత్రి ఋషి శునక్, ప్రపంచ
కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ సైతం హాజరయ్యారు.
‘‘ఇస్లామిక్ పద్ధతులకు లేదా అలా
చెప్పబడుతున్న పద్ధతులకు, మా (ఐరోపా) నాగరికత అనుసరించే విలువలు, విధానాలు,
హక్కులకు ఎంతమాత్రం పొంతన కుదరదు. ఇంకో విషయం కూడా నా మనస్సును ఎప్పుడూ తొలుస్తూనే
ఉంటుంది. ఇటలీలోని ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రాలు అన్నింటికీ సౌదీ అరేబియాయే
ఆర్థిక సహకారం అందిస్తోంది’’ అని మెలోనీ అన్నారు.
సౌదీ అరేబియా (Saudi Arabia) అనుసరిస్తున్న అత్యంత
కఠినమైన షరియా చట్టాన్ని (Sharia Law) కూడా జార్జియా మెలోనీ విమర్శించారు. ఇస్లామిక్ షరియా
చట్టం ప్రకారం మతం మారడం, హోమోసెక్సువాలిటీ చాలాపెద్ద నేరాలు. ఐరోపా దేశాల్లో
ప్రజలకు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది. అలాగే అక్కడ స్వలింగ సంపర్కం
అనేది సాధారణమైన విషయం. అలాంటి వాటిని ఇస్లాం మతపు నియమ నిబంధనలతో బేరీజు వేసి
వాటిని ఏకపక్షంగా నేరాలుగా పరిగణించడాన్ని ఆమె తప్పుపట్టారు. ముస్లిం మతం షరియా
చట్టాన్ని తప్ప మరే ఇతర చట్టాలు, న్యాయాలను ఒప్పుకోదు. వారి షరియా చట్టపు
నియమనిబంధనలు ఇస్లాం మతానికి మూలమైన ఖురాన్‌కు, ఇస్లాం మత నియమావళి అయిన హడీత్కు పూర్తిగా
లోబడి ఉంటాయి.
‘‘షరియా ప్రకారం వ్యభిచారానికి శిక్ష రాళ్ళతో
కొట్టి చంపడం. మతం మారిన వారికి, స్వలింగ సంపర్కానికి పాల్పడేవారికీ మరణశిక్షే.
అలా చెప్పడం అంటే ఇస్లాం మతాన్ని సాధారణీకరించడం కాదు. అలా చెప్పడం ద్వారా మనం
ఎదుర్కొంటున్న ఒక సమస్యనుప్రస్తావిస్తున్నానంతే. ఐరోపాలో జనాలను ఇస్లామీకరణ చేసే ఒక ప్రక్రియ
నడుస్తోంది. అది మన ఐరోపా నాగరికత పాటించే విలువలకు అందరానంత దూరంలో ఉంది. దానివల్ల
ఐరోపాలో సమస్యలు తలెత్తుతున్నాయి’’ అని మెలోనీ చెప్పారు.
రోమ్ పర్యటనలో ఉన్న యునైటెడ్ కింగ్డమ్
ప్రధానమంత్రి ఋషి శునక్, వలసల విధానంపై జార్జియా మెలోనీ అనుసరిస్తున్న విధానాన్ని
సమర్ధించారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని ఇస్లామిక్ దేశాల నుంచి ఐరోపాలోని వివిధ
దేశాలకు అక్రమంగా వలస వస్తున్న ముస్లిముల వల్ల ఆయా దేశాలు ఎన్నో ఇబ్బందులు
ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు, అక్రమ వలసలను అడ్డుకోడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు
చేసే ప్రయత్నాలను ప్రజాస్వామ్యం పేరిట, సామ్యవాదం పేరిట తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలపై హ్రస్వదృష్టి కలిగిన, ఉదారవాద దృక్పథం
లేని జాతీయవాదులు అన్న ముద్ర వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఒత్తిడులు
పెంచుతున్నారు. అలాంటి సమస్య ఎదుర్కొంటున్న దేశాల్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ
ప్రధానమైనవి.
ఇంగ్లండ్ తమ దేశంలోకి అక్రమ వలసలను
నిరోధించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అనుమతి లేకుండా ఇంగ్లండ్ గడ్డమీద
అడుగుపెట్టే వారిని ఆఫ్రికాలోని రువాండా దేశానికి పంపించివేయాలన్నదే ఆ పథకం. ఆ
మేరకు రువాండాలో ఇంగ్లండ్ ఏర్పాట్లు కూడా చేసింది. అక్రమ వలసదారులకు ఆశ్రయం
ఇవ్వడానికి తగినంత స్థలం ఇంగ్లండ్‌లో లేకపోవడం ఒక కారణం. వలస వచ్చినవారు రేపుతున్నగొడవలు
పైకి చెప్పని ప్రధాన కారణం. ఆ పథకానికి ఇంటా బయటా ఎంతో వ్యతిరేకత తలెత్తింది.
అయినా శునక్ సర్కారు వెనక్కు తగ్గడం లేదు. ఆ నేపథ్యంలో ఇటలీకి ఇంగ్లండ్ సమర్థన
ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా
మధ్యధరా సముద్రం మీదుగా తమ దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులను నిలువరించడం
కోసం, సముద్రంలో సహాయం అందించే ఓడల కార్యకలాపాలను నియంత్రించడానికి
ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలను ఉదారవాదులు విమర్శిస్తున్నారు. ‘‘ఈ సమస్యను ఎదుర్కొనకపోతే,
దేశంలోకి చొరబడే అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది. అది మన ఐరోపా దేశాలను
ఎప్పటికైనా ముంచేస్తుంది. మన సహాయం నిజంగా కావలసినవారికి మనం సహాయం చేయలేకపోతాం’’
అని ఋషి శునక్ చెప్పారు.
‘‘ఈ సమస్యను ఎదుర్కోవడంలో విశ్వసనీయత సాధించాలంటే
మనం సాధారణంగా ప్రజల్లో ఉండే ఏకాభిప్రాయాన్ని దాటాలి. దానికి నేనూ, జార్జియా
సిద్ధపడి ఉన్నాం’’ అని ఋషి శునక్ స్పష్టం చేసారు.