తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు (anganvadi workers strike) చేస్తోన్న నిరసన ఏడో రోజుకు చేరింది. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పింఛను అమలుపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సీడీపీవో కార్యాలయాల వద్ద అంగన్వాడీలు వారం రోజులుగా నిరసనలు చేస్తున్నారు.
సచివాలయ సిబ్బందితో అంగన్వాడీల విధులు చేయించడంపై వారు మండిపడుతున్నారు. తమకు పనిచేయని మొబైల్ ఫోన్లు ఇచ్చారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతం ఇస్తామని జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు.