లిబియా తీరంలో పడవ మునిగిపోయిన దుర్ఘటనలో కనీసం 61 మంది వలసదారులు చనిపోయి ఉంటారని సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. లిబియా వాయువ్య తీరంలో జువారా నుంచి బయలుదేరిన వలసదారులు సముద్రంలో భీకరగాలులు, అలల కారణంగా నౌన మునిగి చనిపోయారని భావిస్తున్నారు. నైజీరియా, గాంబియా, ఆఫ్రికన్ దేశాల మహిళలు, పిల్లలతో సహా 86 మంది నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడిన వారి సమాచారంతో విషయం వెల్లడైంది.
25 మంది వలసదారులను రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు ఐవోఎం తెలిపింది. లిబియా, ట్యునీషియా మీదుగా ఇటలీ చేరుకోవాలని వలసదారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ట్యునీషియా, లిబియా నుంచి ఈ ఏడాది 153000 మంది వలసదారులు ఇటలీ చేరుకున్నారు.