రామమందిర
నిర్మాణంతో అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆధ్యాత్మిక
పర్యాటకుల తాకిడి పెరగడంతో స్థానికులు తమ ఇళ్ళను అతిథిగృహాలుగా మారుస్తున్నారు.
ఆలయ ప్రారంభోత్సవ తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ అయోధ్యలో ఆస్తి విలువ పెరుగుతోంది.
భక్తులు, పెట్టుబడిదారులు, వ్యాపారులు అయోధ్యకు వరుస కట్టడంతో ఆస్తి విలువ మూడు
రెట్లు పెరిగింది.
అయోధ్య
రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు
శ్రీరాముడి జన్మభూమికి తరలిరానున్నారు. వచ్చే ఏడాది జనవరి 22న భవ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు శ్రీరామ
జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. దేశ ప్రజల చిరకాల ఆకాంక్ష తీరనుండటంతో సనాతనులు ఈ
కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సిద్ధమవుతున్నారు.
రామ్
లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా స్థానిక అధికారులు పలు
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల రద్దీని అంచనా వేస్తూ అందుకు తగినట్లుగా
మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా, రవాణా పై దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి సమస్యలు
ఎదురుకాకుండా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు
డ్రోన్ల ద్వారా భద్రతా చర్యలను సమీక్షిస్తున్నారు.
ప్రధాని
నరేంద్రమోదీ సహా 4 వేల మంది సాధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెబుతున్న
అధికారులు, ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున రద్దీని తగ్గించే చర్యలకు సిద్ధమయ్యారు.
జనవరి 22న అయోధ్య రావడానికి బదులుగా స్థానికంగా ఉండే ఆలయాలను సందర్శించి పూజలు
చేయాలని భక్తులకు విన్నవించారు.
పెద్ద
ఎత్తున భక్తులు తరలి వస్తే అయోధ్యలో తగిన సదుపాయాలు కల్పించలేమని, అలాగే భద్రతా
పరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని వివరిస్తున్నారు.
అయోధ్య రావడానికి బదులుగా దగ్గరలోని
ఆలయంలో సమావేశమై పూజలు చేయమని శ్రీ రామ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్
కోరారు. గర్భగుడి, విగ్రహం సిద్ధంగా
ఉన్నప్పటికీ ఆలయం మొత్తం తుది రూపుకు రావడానికి ఇంకా రెండేళ్ల సమయం పడుతుందన్నారు.
జనవరి
16 నుంచి రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఆరంభం కానుండగా,
ప్రధాన క్రతువును ప్రముఖ పండితులు లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహిస్తారు.
ప్రయాణికుల కోసం వసతి, ఫుడ్ కోర్టు, వాణిజ్య
కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది.