వ్యాసకర్త-
ఐవైఆర్ కృష్ణారావు, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
గొప్ప తత్వవేత్త ఎడ్మండ్ బర్క్ సమస్య
పరిష్కారానికి చేసే తాత్కాలిక చర్యలను గురించి మాట్లాడుతూ తాత్కాలికం అనుకున్న
చర్యలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు జాస్తి అని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 370 అధికరణకు ఇది పూర్తిగా వర్తిస్తుంది.
కేవలం తాత్కాలికంగా భావించబడిన
370 అధికరణ దాదాపు 60 సంవత్సరాలు అమలులో ఉంది. 2019 ఆగస్టు 5న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని
కేంద్ర ప్రభుత్వం తొలగించే వరకు 370 అధికరణ,35-A భారత రాజ్యాంగంలో కొనసాగాయి.
బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలి
వెళ్ళినప్పుడు బ్రిటిష్ దేశపు ప్రత్యక్ష పాలనలో ఉన్న భూభాగం భారతదేశం పాకిస్తాన్
గా విడిపోయింది. ఆంగ్ల సామ్రాజ్యం ఆధిపత్యంలో స్వతంత్ర ప్రతిపత్తితో పరిపాలన
కొనసాగిస్తున్న చాలా పెద్ద సంఖ్యలో ఉన్న రాజ్యాలకు కూడా స్వతంత్రం వచ్చింది. వారి
భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం వారికి వదిలేసి బ్రిటిష్ వారు
నిష్క్రమించారు. వీటిని భారతదేశంలో విలీనం చేయటం ఆరోజు ఒక పెద్ద సవాలుగా
నిలిచింది.
చాలా చాకచక్యంతో పట్టుదలతో సర్దార్ పటేల్ ఈ రాజ్యాలన్నింటిని ఎలాంటి
సమస్య లేకుండా భారతదేశంలో విలీనం చేయటంలో సఫలీకృతులయ్యారు. కానీ మూడు సంస్థానాలు సమస్యగా మిగిలాయి. అవే
హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు. హైదరాబాద్ పోలీస్ యాక్షన్ తో, జునాగఢ్ స్థానిక ప్రజల తిరుగుబాటుతో భారతదేశంలో విలీనం అయిపోయాయి. ఇక ప్రధాన సమస్యగా మిగిలింది కాశ్మీర్ మాత్రమే.
కాశ్మీర్ సంస్థానం భారత్ పాకిస్తాన్
రెండు దేశాల మధ్యలో ఉంది. ప్రజలలో అధిక శాతం ముస్లింలు. రాజు హిందూ.
ఈ ప్రాంతాన్ని
కాశ్మీర్లో కలుపుకోవాలని ఉద్దేశంతో జిన్నా, ఆ దేశం లోకి పఠాన్ గెరిల్లాలను పంపించాడు. ఇది
చూసిన కాశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్
కాశ్మీర్ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేశారు. ఐక్యరాజ్యసమితి ముందుకుపోయిన ఈ
సమస్య కాశ్మీర్ రెండుగా విడిపోవడానికి కారణమైంది. కొంత ప్రాంతం పాకిస్తాన్
ఆక్రమణలో ఉండగా ఎక్కువ భాగం భారతదేశంలో విలీనం అయింది.
రాజ్యాంగాన్ని రూపొందించే
సమయంలో ఈ ప్రాంతానికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తూ ఏర్పాటు చేయబడిన
విధానమే ఈ 370 అధికరణ 35ఏ . 370 ప్రకరణకు అనుగుణంగా పార్లమెంటు తన
అధికారాలకు లోబడి చేసే ఏ చట్టమైన కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేయటానికి ఆ రాష్ట్ర
శాసనసభ ఆమోదం కావాలి. ఇక 35 ఏ క్రింద కాశ్మీర్ ప్రాంత ప్రజలకు
కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించడం జరిగింది. ప్రాంతంలో బయటివారు భూములు
కొనుక్కోవటానికి కానీ ఇతరత్రా ఆస్తులు సంపాదించుకోవటానికి గాని వీలు ఉండదు. ఈ
రెండు ప్రకరణల వలన ఆ ప్రాంత ప్రజలకు భారతదేశంలో మిగిలిన ఏ ప్రాంతాల్లో లేని విధంగా
తమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదనే భావన కలిగించాయి. ఈ ప్రాంతం మిగిలిన భారతదేశంలో
పూర్తిగా ఏకీకరణకు అవరోధంగా మిగిలాయి.
ఆనాటి జనసంఘ్ పార్టీ ఆ రోజే ఈ 370 అధికరరణను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆనాటి జనసంఘ్ పార్టీ
అధ్యక్షులు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ శ్రీనగర్లో అనుమానాస్పద పరిస్థితులలో
మృతి చెందారు. ఆనాటి నుంచి నాటి జనసంఘ పార్టీకి ఆ పైన దానికి వారసత్వంగా వచ్చిన
భారతీయ జనతా పార్టీకి 370 ప్రకారం రాజ్యాంగ నుంచి తొలగించటం ఒక
ప్రధానమైన లక్ష్యం. దీనికి అనుగుణంగానే 2019లో అధికారంలోకి రెండవ తడవ వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై
దృష్టి పెట్టి ఐదు ఆగస్టు 2019 నాడు ఈ ప్రకరణను తొలగిస్తూ చట్టం చేసింది.
డిసెంబర్ 11, 2023 నాడు సుప్రీంకోర్టు ప్రభుత్వ ఈ చర్యను
సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది. దీనితో ఈ అంశానికి ఒక ముగింపు వచ్చింది.
సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు
సమానంగా అభివృద్ధి దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని రాష్ట్రాలకు
ప్రత్యేకత సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశంలోని ప్రజలందరూ సమైక్యంగా అభివృద్ధి
చెందటానికి ఇవి అడ్డుగోడాలవుతాయి. ఈ ప్రకరణలు రాజ్యాంగంలో ఉన్న ఏ విధంగాను
కాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదం చేయలేదు. పైపెచ్చు అభివృద్ధి జరగటానికి
పెట్టుబడుల ఆకర్షణకు ముఖ్యంగా 35ఏ అడ్డుగోడగా నిలిచింది.
భవిష్యత్తులో
కాశ్మీర్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి దిశలో పయనించడానికి సరైన
వాతావరణం కల్పించినట్లు అయింది.