కోట్లాది మంది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెల 22 పవిత్ర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శనం (Indian Railways) కల్పించనున్నారు. దేశ, విదేశాల నుంచి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రామాలయం ప్రారంభించిన తొలి వంద రోజుల్లో వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రామ మందిరం ప్రారంభోత్సవానికి మూడు రోజుల ముందు నుంచే అంటే జనవరి 19 నుంచే ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్కతా, నాగపుర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. భక్తుల రద్దీని
దృష్టిలో ఉంచుకుని అయోధ్యలోని రైల్వే స్టేషన్ను ఆధునికీకరిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తరవాత రోజుకు కనీసం 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.