Bangladesh Mukti Diwas:
India won war, lost peace
1971 డిసెంబర్ 16 వరకూ భారతదేశానికి రెండు
దిక్కుల్లోనూ తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ విభాగాలు ఉండేవి. ఆ రోజున ఢాకాలో లెఫ్టినెంట్
జనరల్ నియాజీ 90వేల మంది పాకిస్తాన్ సైనికులతో లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అనే కొత్త
దేశం పుట్టింది. ఆ కథ ఇప్పుడు చరిత్ర. ఆ చరిత్ర, భారతదేశపు భౌగోళిక నైసర్గిక
స్వరూపం ఎలా మారిపోయిందో వివరిస్తుంది.
సాధారణ భారతీయ పౌరులమైన మనం తలలు వంచి,
లెక్కలేనన్ని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పించాల్సిన
సమయమిది. 1971 డిసెంబర్ 3 నుంచి 16 వరకూ 13 రోజులపాటు జరిగిన యుద్ధంలో భారత సైన్యం
ఘనవిజయం సాధించింది. ఆ విజయానికి ప్రధాన కారణం ఆనాటి ఆర్మీచీఫ్ జనరల్ శామ్ మానెక్
షా. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏప్రిల్ నెలలోనే యుద్ధం చేయాలని ఉవ్విళ్ళూరితే,
కాదూ కూడదంటూ ఆమెను వ్యతిరేకించిన ధీరుడాయన.
1971 ఏప్రిల్‌లో యుద్ధానికి వెళ్ళడం
సరికాదని మానెక్షా పట్టుపట్టడానికి సరైన కారణమే ఉంది. అప్పటికి భారత సైన్యం
యుద్ధానికి సిద్ధంగా లేదు. యుద్ధానికి సరిపడా ఆయుధాలూ లేవు. 1971 ఏప్రిల్ నుంచి
డిసెంబర్ వరకూ తొమ్మిది నెలల పాటు భారత సైన్యానికి అద్భుతమైన శిక్షణ ఇప్పించాడాయన.
ఆ వ్యవధిలోనే ఆయుధాలను కొని, సరిహద్దుల వద్ద తగినన్ని నిల్వలను స్టాక్ చేయించాడు. 1971లో
సోవియట్ యూనియన్‌లో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకోవడం కూడా దౌత్యపరంగా
కలిసొచ్చింది.
స్వతంత్ర భారతదేశపు గొప్ప ఆర్మీ జనరల్,
తర్వాత ఫీల్డ్‌మార్షల్ అయిన శామ్ మానెక్ షా జీవిత చరిత్ర ఆధారంగా ఇటీవలే ‘శామ్
బహాదుర్’ అనే సినిమా వచ్చింది. ఆ నిజజీవిత గాధ విమర్శకుల ప్రశంసలతో పాటు
ప్రేక్షకుల ఆదరణ కూడా సొంతం చేసుకుంది. దానికి కారణం మన నిజమైన చరిత్రను
తెలుసుకోవాలన్న భావన దేశ ప్రజల్లో పెరుగుతుండడమే. ఆ సినిమా ప్రజల్లో జాతీయతా
భావనలను జాగృతం చేస్తోంది, మన శౌర్యప్రతాపాలను తలచుకుని మనం తలెత్తుకునేలా
చేస్తోంది.
బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ చేయాలనుకున్న
నరమేధానికి ఆపరేషన్ సెర్చ్‌లైట్ అనే పేరు పెట్టారు. ఆ ఆపరేషన్ లక్ష్యాలు ఢాకా
విశ్వవిద్యాలయంలో ‘జగన్నాథ్ హాల్’ అని పిలిచే ముస్లిమేతర విద్యార్ధుల డార్మిటరీ, రాజర్బాగ్
పోలీస్ లైన్స్, తూర్పు పాకిస్తాన్ రైఫిల్స్ ప్రధాన కార్యాలయమైన పిల్ఖానా. పాక్
సైన్యం ఢాకా విశ్వవిద్యాలయ డార్మిటరీల్లో ఉన్న 34మంది విద్యార్ధులను అమానుషంగా
కాల్చిపడేసింది. పాత ఢాకాలో హిందూ జనాభా ఎక్కువగా ఉండే ఇరుగు పొరుగు ప్రదేశాలపైనా
దాడులు చేసింది. ఆ రాత్రి జరిగిన ఘోరమైన దాడిలో 7వేల మంది హతమయ్యారు, మరో 3వేల
మందిని అరెస్ట్ చేసారని రాబర్ట్ పేన్ అనే అమెరికన్ జర్నలిస్టు అంచనా వేసాడు. పాక్
చేపట్టిన ఆ ఆపరేషన్‌లో ఢాకా విశ్వవిద్యాలయపు ఉపాధ్యాయులు హతమయ్యారు.
పాకిస్తాన్ సైన్యం మార్చి 25న బంగ్లాదేశ్
అధ్యక్షుడు షేక్ ముజీబ్‌ను అరెస్ట్ చేసింది. 1971 మార్చిలో పాక్ సైన్యం రామ్నాకాళీ
మందిరాన్ని ధ్వంసం చేసింది. ఆ సమయంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం యుద్ధం
చేయడం సరైనదే. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం అనుసరించిన పద్ధతే
అస్తవ్యస్తంగా ఉంది. దాని గురించి సరైన అధికారికమైన చరిత్ర రాసుకోవడం భవిష్యత్
అవసరాల కోసం తప్పనిసరి. ఆ చరిత్రను రక్షణ శాఖ సరిగ్గా పరిశీలించి ఆమోదించాలి. ఆనాటి
పరిణామాల తర్వాత గత యాభైఏళ్ళలో జరిగిన సంఘటనలు, మన సీనియర్ సైన్యాధికారులు,
పండితులు కలిసి సరైన, అధికారికమైన చరిత్రను రూపొందించగలరు.
ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకొకటి
ఉంది. పాకిస్తాన్, భారతదేశాలు జమ్మూకశ్మీర్ కోసం 1947-48లో యుద్ధం చేసాయి. ఆ
యుద్ధానికి సంబంధించి అధికారిక చరిత్రను రక్షణ శాఖ వెలువరించింది. ఆ తర్వాత 1965లోనూ,
1971లోనూ భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, కానీ వాటి అధికారిక
చరిత్రలు నేటికీ లేవు.
1971లో డిసెంబర్ 3 నుంచి 16 వరకూ 13రోజుల
పాటు యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ముగిసేసరికి పాకిస్తాన్ తన తూర్పు భాగాన్ని
పోగొట్టుకుని రెండు దేశాలుగా విడిపోయింది. తూర్పుపాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే
ప్రత్యేక దేశంగా ఏర్పడింది. దురదృష్టవశాత్తూ ఆ యుద్ధం గురించి అధికారికంగా
ఆమోదించిన వివరణ ఏదీ లేదు. నిజానికి ఆ యుద్ధం గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి
కానీ అధికారిక చరిత్ర అయితే నమోదు కాలేదు. తూర్పు పాకిస్తాన్లో జరిగిన యుద్ధం
గురించి ఒక సంపుటం, పశ్చిమ పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం గురించి మరో సంపుటం
రూపొందించవచ్చు.
1971 యుద్ధాన్ని గురించి జార్జిటౌన్
విశ్వవిద్యాలయంలో భద్రతా అంశాల ప్రొఫెసర్ క్రిస్టీన్ ఫెయిర్ ఇలా రాసింది, ‘‘యుద్ధం
తర్వాత 1972 జులైలో జుల్ఫికర్ అలీ భుట్టోతో సిమ్లా ఒప్పందం మీద సంతకం చేయడం ద్వారా
భారతదేశం తన విజయాన్ని వదులుకుని విజయవంతంగా ఓటమిని దక్కించుకుంది. ఆ ఒప్పందంతో యుద్ధం
ముగియడం అనే లాంఛనం పూర్తయింది. అయితే, యుద్ధంలో స్పష్టంగా విజేతగా నిలిచిన భారత్,
అత్యంత సందేహాస్పద రీతిలో, పాకిస్తాన్ డిమాండ్లు దాదాపు అన్నింటికీ, ఏమాత్రం
అభ్యంతరపెట్టకుండా అంగీకరించింది.’’
క్రిస్టీన్ ఫెయిర్
అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ ప్రాంత వ్యవహరాలపై అత్యంత గౌరవనీయురాలైన విదుషీమణి. ఆమె
తన జీవితంలో అత్యధిక భాగం పాకిస్తాన్ గురించి అధ్యఆమయనం చేసింది. ఆమె రాసిన
అత్యంత ప్రభావశీల గ్రంథాల్లో ప్రధానమైనది ‘‘ఫైటింగ్ టు ది ఎండ్ : ది పాకిస్తాన్
ఆర్మీస్ వే ఆఫ్ వార్’’.
దక్షిణాసియా గురించి, ప్రధానంగా భారత్,
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక గురించి ఆమె రాసిన వ్యాసాలు, పుస్తకాలూ
అమూల్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ఆవిడ ప్రసంగాలు కూడా యూట్యూబ్‌లో విస్తృతంగా
అందుబాటులో ఉన్నాయి. ఆమె తన పేరు మీద christinefair.net అనే వెబ్సైట్ కూడా నిర్వహిస్తోంది.
అర్ధశతాబ్దం దాటిపోయిన తర్వాత ఇప్పుడు
వెనక్కి తిరిగిచూసుకుంటే 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో రెండు ఘటనలు ప్రధానంగా
కనిపిస్తాయి. వాటిలో మొదటిది పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ నియాజీ ఢాకాలో 1971
డిసెంబర్ 16న భారతదేశపు లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ అరోరాకు లొంగిపోయిన చిరస్మరణీయమైన
చిత్రం. రెండవది 1972 జులైలో సిమ్లా ఒప్పందం మీద సంతకాలు పెట్టిన తర్వాత
పాక్-భారత్ నాయకులు జుల్ఫికర్ అలీ భుట్టో, ఇందిరాగాంధీల చిత్రం.
పాకిస్తాన్‌తో మన సంబంధాలు మెరుగుపడతాయని
మనను మనం మోసం చేసుకోవద్దు. 1971 యుద్ధానికి దారితీసిన పరిస్థితులను, దాని
మూలాన్ని, జరిగిన యుద్ధాలను, వాటి తుదిఫలితాలను సరిగ్గా అర్ధం చేసుకోవడం అత్యంత
ఆవశ్యకం. మన దేశ ప్రజల్లో చాలామందికి ఆ వివరాలు ఏమీ తెలియవు.
ప్రస్తుతం మనకూ పాకిస్తాన్‌కూ మధ్య
సంబంధాలు గతంతో పోలిస్తే ప్రశాంతంగానే ఉన్నాయి. కానీ దానికి కారణం పాకిస్తాన్
ప్రస్తుతం ఆర్థికంగా అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉండడం మాత్రమే. అంతేతప్ప అదేమీ
పాకిస్తాన్ సహృదయత వల్లనో, లేక దాని సామర్థ్యాలు మందగించడం వల్లనో మాత్రం కాదు.
కనీసం కొంతకాలం పాటు పాకిస్తాన్‌తో భారత్
సంబంధాలు ఇప్పుడు ఉన్నవిధంగానే కొనసాగవచ్చు. కానీ మనం 1971 యుద్ధం తుది ఫలితాన్ని
పరిశీలించుకోవాలి. ఆ యుద్ధంలో గెలిచిన భారతదేశం పొందిన లబ్ధి ఏమిటో తెలుసుకోవాలి.
నిజం చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత మన దేశం చాలా సమస్యలు ఎదుర్కొంది.
భారత్‌తో ప్రత్యక్ష యుద్ధాలు అన్నింటిలోనూ ఓడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత తన దృష్టి
అంతా ప్రచ్ఛన్న యుద్ధాలు చేయడం మీదనే కేంద్రీకరించింది. గత కొన్ని దశాబ్దాలుగా మన
దేశం ఎదుర్కొంటున్న, ఇక శాశ్వతంగా ఎదుర్కొనే పరిస్థితి అదే.
పంజాబ్‌లో ఖలిస్తానీలకు అండగా నిలవడం
కానివ్వండి, జమ్మూకశ్మీర్‌లో జిహాద్‌ను ప్రోత్సహించడం కానివ్వండి, రెండూ
పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగినవే. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లను తమ స్వాధీనం
చేసుకోవాలన్న పాకిస్తాన్ కోరిక శాశ్వతమైనది. ఆ కోరికను పాకిస్తాన్ ఎప్పటికీ
విడిచిపెట్టదు. దానికి కారణం సట్లెజ్, బియాస్, రావి, జీలం, చీనాబ్, ఇండస్ (సింధు)
నదుల్లో ప్రవహించే నీరే. ఆ రెండు రాష్ట్రాల మీదుగానే ఆ నదుల జలాలు పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్నాయి.
కాబట్టి ఆ రెండు రాష్ట్రాలనూ భారత్ నుంచి విడగొట్టేయడానికి, తమ దేశంలో కలిపేసుకోవడానికీ
పాకిస్తాన్ తన ప్రయత్నాలను ఎప్పటికీ ఆపదు. జమ్మూకశ్మీర్ విషయంలో తమ వైఖరిని
పాకిస్తాన్ ఏనాడూ దాచుకోలేదు.
1990లో పర్వేజ్ ముషారఫ్ లండన్‌లోని రాయల్
మిలటరీ అకాడెమీలో బ్రిగేడియర్ హోదాలో ఒక థీసిస్ రాసాడు. అందులో అతను చాలా
స్పష్టంగా భారత పాకిస్తాన్ వివాదాల మధ్య అసలైన కారణం నీరు. ఆ వివాదాలు
భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి’’ అని ప్రస్తావించాడు. దురదృష్టవశాత్తూ ఆ
డాక్యుమెంట్ ప్రజలకు అందుబాటులో లేదు. అందులో ముషారఫ్ ఈ అంశం గురించి తన
ప్రసంగాల్లో చిన్న చిన్న ముక్కలుగా ప్రస్తావించాడు.