ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు (ratan tata) బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం ముంబయి పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సైరస్ మిస్త్రీ తరహాలోనే రతన్ టాటాను చంపేస్తానంటూ బెదిరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రతన్ టాటా ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు భద్రత పెంచాలని యోచిస్తున్నారు.
రతన్ టాటాకు భద్రత పెంచేందుకు పోలీసులు కొన్ని తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేసింది ఎవరనే విషయంలో కూడా దర్యాప్తు మొదలైంది. కర్ణాటక నుంచి కాల్ వచ్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతోన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.