హమాస్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు (israel hamas war) చేస్తోంది. ఈ క్రమంలో తీవ్రవాదులుగా పొరపడి ముగ్గురు బందీలను ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపారు. ఈ విషయాన్ని ఐడీఎఫ్ స్వయంగా ప్రకటించింది. గాజాలోని షెజైయాలో జరుగుతోన్న దాడుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. హమాస్ ఉగ్రవాదులుగా పొరపడి ఇజ్రాయెల్ సైనికులు ముగ్గురు బందీలను కాల్చివేశారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని అజా ప్రాంతానికి చెందిన యోటమ్ హైమ్గా గుర్తించారు. మరొకరు కిబుట్జ్ నిర్ అమ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మూడో వ్యక్తి పేరు ప్రకటించలేదు.
హమాస్ ఉగ్రవాదులు గత అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసి 1200 మంది పౌరులను చంపివేశారు. ఆ తరవాత మొదలైన యుద్దంలో ఇప్పటి వరకు 18700 మంది పాలస్తీనియన్లు చనిపోయారని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాజాలో యుద్ధం ఆపాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. అయినా ఉగ్రవాదులను తుదముట్టించే వరకు యుద్దం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తేల్చి చెప్పారు.