Bhajanlal Sharma swears in as Rajasthan CM
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్
శర్మ ఇవాళ ప్రమాణస్వీకారం చేసారు. జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కల్రాజ్మిశ్రా
కొత్త ముఖ్యమంత్రితో ప్రమాణస్వీకారం చేయించారు.
భజన్‌లాల్ శర్మతో పాటు
ఉపముఖ్యమంత్రులుగా దియాకుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా ప్రమాణస్వీకారం చేసారు. ఆ
కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్,
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గుజరాత్
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాజస్థాన్
మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్రమంత్రులు అర్జున్‌రామ్ మేఘ్వాల్,
గజేంద్రసింగ్ షెకావత్, నితిన్ గడ్కరీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భజన్‌లాల్ శర్మ రాజస్థాన్ తూర్పు
ప్రాంతంలోని భరత్పూర్ జిల్లాకు చెందినవారు. ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
నేపథ్యముంది. భజన్‌లాల్ శర్మ రాజనీతిశాస్త్రంలో ఎంఎ చేసారు. సంగనేర్ శాసనసభా
నియోజకవర్గం నుంచి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై
48,081 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ప్రేమ్‌చంద్ బైర్వా దూడూ నియోజకవర్గం
నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి బాబూలాల్ నాగర్పై
35,743 ఓట్ల ఆధిక్యం సాధించి మరోసారి గెలిచారు. దియాకుమారి జైపూర్‌కు చెందిన
రాజవంశీకురాలు. విద్యాధర్‌నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి సీతారామ్
అగర్వాల్ మీద 71,368 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
రాజస్థాన్
శాసనసభలో 200 స్థానాలున్నాయి. వాటిలో 199 నియోజకవర్గాలకు నవంబర్ 25న ఎన్నికలు
జరిగాయి. డిసెంబర్ 3న జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది.
కాంగ్రెస్ 69 స్థానాలకు పరిమితమైంది. కౌంటింగ్ జరిగిన 12 రోజుల తర్వాత అంటే
డిసెంబర్ 15న బీజేపీ రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.