Parliament adjourned
for the day amid ruckus
పార్లమెంటు భద్రతా వైఫల్యం అంశంపై ప్రతిపక్షాల
రగడతో ఉభయసభలూ ఇవాళ అట్టుడికాయి. ఎలాంటి కార్యకలాపాలూ జరక్కుండానే వాయిదాపడ్డాయి.
రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు, అధికార
పక్ష నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ ఛైర్మన్ కొద్ది నిమిషాల్లోనే వాయిదా
వేసారు. చైర్మన్ తానొక ముఖ్యమైన ప్రకటన చేయాలని ప్రకటించినప్పటికీ ఇరు పక్షాల
ఎంపీల మధ్యా వాగ్వివాదం ఆగలేదు. ఆ గోలలో చైర్మన్ సభను సోమవారం ఉదయం 11 గంటలకు
వాయిదా వేసారు. లోక్‌సభలో కూడా అలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్రతిపక్షాల గొడవ వల్ల
సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో సభను సోమవారానికి వాయిదా వేసారు.
ఈ ఉదయం పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచే
ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు రగడ చేయడం మొదలుపెట్టాయి. పార్లమెంటులో పొగ వ్యవహారం
భద్రతా వైఫల్యమంటూ అధికార పక్షంపై మండిపడ్డాయి. ఆ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్
షా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేసాయి.
రాజ్యసభ ఉదయం 11గంటలకు ప్రారంభం కాగానే
గొడవ మొదలైంది. ఆ హడావుడిలోనే కొన్ని పత్రాలు టేబుల్ చేసారు, ముగ్గురు కేంద్రమంత్రులు
ప్రకటనలు చేసారు. మరోవైపు 23మంది ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ సభావ్యవహారాలను రద్దు చేసి
డిసెంబర్ 13నాటి భద్రతా వైఫల్యంపై చర్చించాలంటూ రూల్ 267 కింద నోటీసులు జారీ
చేసారు. అయితే, సభకు తాను ఆనాటి ఘటన గురించి అన్ని విషయాలూ తెలియజేసాననీ, ఆ
వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందనీ, ఈ తరుణంలో చర్చకు అనుమతి సాధ్యం కాదనీ ఛైర్మన్
జగదీప్ ధన్‌ఖడ్ ఆ నోటీసులను తిరస్కరించారు. దాంతో ప్రతిపక్ష ఎంపీలు సభలో గొడవ
మొదలుపెట్టారు. సభలో ప్రతిపక్ష నేత ప్రకటననైనా అనుమతించాలంటూ ఛైర్మన్‌ను డిమాండ్
చేసారు. ఆ తరుణంలో రాజ్యసభను మధ్యాహ్నం 2గంటల వరకూ సభాపతి వాయిదా వేసారు.
లోక్‌సభలో కూడా అదే తంతు కొనసాగింది.
పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్య సభ మధ్యాహ్నం 2 గంటల
వరకూ వాయిదా పడింది.
ప్రతిపక్షాలకు చెందిన
పలువురు ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. భద్రతా
వైఫల్యం ఘటనకు సంబంధించి నిందితులకు విజిటర్స్ పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్
సింహపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ప్రధానమంత్రి, హోంమంత్రి ఎందుకు మౌనంగా
ఉన్నారు? బీజేపీ ఎంపీపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటూ ప్లకార్డులు
ప్రదర్శించారు.