Iron Man of India
Sardar Vallabh Bhai Patel
భారతదేశాన్ని విభజించి పాలించిన బ్రిటిష్
వారు, దేశాన్ని వదిలివెళ్ళక తప్పని పరిస్థితిలో మనకు స్వాతంత్ర్యం లభించింది. అంతకు
ముందు దేశంలో వివిధ రాజసంస్థానాలు ఎక్కడికక్కడ స్థానికంగా పరిపాలన చేస్తుండేవి. వాటిలో
కొన్నింటిని బ్రిటన్ ఆక్రమించుకుని తమ ప్రత్యక్ష అధికారాన్ని స్థాపించుకుంది. స్వాతంత్ర్యానంతరం
భారత్‌ను ప్రజాస్వామ్య దేశంగా చేసే క్రమంలో ఆయా రాజసంస్థానాలను ఏకత్రితం చేయాల్సిన
అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతను ప్రధానంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ తలకెత్తుకున్నారు.
ఒక్క కశ్మీర్, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని సంస్థానాధీశులనూ ఒప్పించారు. హైదరాబాద్‌లో
పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్య చేపట్టి భారత్‌లో విలీనం చేయించారు. కశ్మీర్
సంగతి తాను తేలుస్తానని చెప్పి జవాహర్ లాల్ నెహ్రూ దాన్ని అంతర్జాతీయ సమస్య చేసి
రావణకాష్ఠంలా మార్చారు. అది వేరే కథ. కశ్మీర్ మినహా మిగతా రాజసంస్థానాలను
ప్రజాస్వామ్య భారతంలో విలీనం చేసిన ఘనత ప్రధానంగా సర్దార్ పటేల్‌కే దక్కుతుంది.
ఉక్కుమనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా
పేరు గడించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్‌లోని నాడియాడ్లో
జన్మించాడు. జవేరీభాయ్, లాడ్లా పటేల్ దంపతులకు నాలుగో సంతానం ఆయన. జవేరీభాయ్ 1857
భారత స్వాతంత్య ప్రథమ సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ దళంలో పోరాడిన వ్యక్తి.
అలాంటి ఆయన సంతానం స్వాతంత్ర్య సమరయోధుడు అవడంలో ఆశ్చర్యం ఏముంది.
పటేల్ భారతదేశంలో సాధారణ విద్యాభ్యాసం
పూర్తి చేసుకుని బారిస్టర్ పరీక్ష పాస్ అవడం కోసం ఇంగ్లండ్ వెళ్ళారు. 36ఏళ్ళ వయసులో
లండన్‌లోని లా కాలేజీలో చేరారు. ఆరు నెలలు ముందుగానే న్యాయవిద్య పూర్తి చేసి
భారతదేశం తిరిగి వచ్చి అహ్మదాబాద్‌లో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆయన భార్య జవేర్బా
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1909లో తుదిశ్వాస విడిచింది. ఆ సమయంలో కోర్టులో కేసు
వాదిస్తున్న పటేల్, ఆ పని పూర్తయేంతవరకూ కదలలేదట. తన భార్య మరణ వార్త కూడా ఎవరికీ
చెప్పలేదట. సత్యం పట్ల అదీ ఆయన నిష్ఠ. అంతేకాదు, తర్వాత మరో పెళ్ళి చేసుకోకుండా
ఒంటరి తండ్రిగానే ఇద్దరు పిల్లలనూ పెంచారాయన.
బారిస్టర్‌గా పనిచేస్తున్నపుడే భారత
జాతీయోద్యమం పటేల్‌ను ఆకర్షించింది. గాంధీ సహాయనిరాకరణోద్యమంలో చేరారు. 1928లో
బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా బార్డోలీలో కిసాన్ ఉద్యమం
చేపట్టి విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. విదేశీ
వస్తు దహనంలో భాగంగా తన వద్దనున్న విదేశీ దుస్తులను దహనం చేసారు. అప్పటినుంచీ
జీవితాంతం తన కుమార్తె, కుమారులతో సహా కేవలం ఖాదీ దుస్తులు ధరించారు. గుజరాత్లో
మద్యపానం, అస్పృశ్యత, కులవివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. 1931లో భారత జాతీయ కాంగ్రెస్
కరాచీ సదస్సుకు అధ్యక్షుడిగా పటేల్ ఎన్నికయ్యారు. ఆ సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
ఉప్పు సత్యాగ్రహం, భారత్ ఛోడో ఉద్యమం తదితర పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత
రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్తులో పటేల్ ఒక సీనియర్ సభ్యుడిగా ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో పటేల్ ప్రధాన
భూమిక వహించారు. రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్‌గా
వ్యవహరించారు.
సర్దార్ పటేల్ భారతదేశపు మొట్టమొదటి
మంత్రివర్గంలో ఉపప్రధానమంత్రిగా, హోంమంత్రిగా పని చేసారు. అప్పుడు కూడా ఆయన
స్వతంత్రంగా వ్యవహరించారు తప్ప ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూను అన్ని విషయాల్లోనూ
గుడ్డిగా సమర్థించలేదు. నిజానికి పటేల్‌కు నెహ్రూతో స్వాతంత్ర్య పోరాటం సమయం నుంచీ
పలు విభేదాలున్నాయి. 1936 కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రతిపాదించిన సోషలిజాన్ని
పటేల్ వ్యతిరేకించారు. స్వాతంత్ర్యానంతరం స్వదేశీ రాజసంస్థానాల విలీనం విషయంలో
నెహ్రూ వైఖరిని భిన్నంగా, స్వతంత్రంగా వ్యవహరించారు. పటేల్ చొరవ వల్లనే సంస్థానాల విలీనం
సరళంగా జరిగిపోయింది. నెహ్రూ చొరవ తీసుకున్న కశ్మీర్ వ్యవహారం ఇప్పటికీ భారత్
గుండెల మీద కుంపటిగా మిగిలిన సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్యసమితి
ముందుకు తీసుకువెళ్ళాలన్న నెహ్రూ నిర్ణయాన్ని పటేల్ పూర్తిగా వ్యతిరేకించారు. పాకిస్తాన్
ఏర్పాటు తర్వాత ఆ దేశానికి 55కోట్లు చెల్లించాలన్న గాంధీ నెహ్రూల నిర్ణయంతోనూ
పటేల్ విభేదించారు. మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో నెహ్రూ చక్రవర్తుల రాజగోపాలాచారి
వైపు మొగ్గుచూపితే, పటేల్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను ప్రతిపాదించి విజయం సాధించారు.
సోమనాథ మందిరం పునర్నిర్మాణంలో సర్దార్
వల్లభాయ్ పటేల్ పాత్ర కీలకమైనది. జునాగఢ్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసాక
అప్పటి భారత సైన్యాలను క్రమపరచడం కోసం పటేల్ అక్కడికి వెళ్ళారు. అప్పుడే ఆయన
సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కోసం ఆదేశాలు జారీ చేసారు. తర్వాత కేఎం మున్షీ,
తదితరులతో కలిసి గాంధీని కలిసినప్పుడు సోమనాథ్ పునర్నిర్మాణం గురించి చెప్పారు. అప్పుడు
గాంధీ సోమనాథ్ ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల విరాళాలతో నిర్మించమని
సలహా ఇచ్చారు. కొన్నాళ్ళకే పటేల్ కాలం చేసారు. అయినా ఆయన స్ఫూర్తితో ఆలయ
పునర్నిర్మాణం పూర్తయింది. నెహ్రూ క్యాబినెట్లో ఆహార, పౌరసరఫరాల మంత్రిగా
పనిచేస్తున్న కెఎం మున్షీ పూనికతో ఆలయ పునరుద్ధరణ పూర్తయింది. ఆలయంలో కుంభాభిషేక
కార్యక్రమానికి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ను ఆహ్వానించారు. సోమనాథ దేవాలయ
పునరుద్ధరణ కార్యక్రమానికి మొదటినుంచీ విముఖంగా ఉన్న నెహ్రూ, అప్పటినుంచీ
రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా మారారు. నెహ్రూ హిందూ వ్యతిరేకతకు సోమనాథ్ ఘటన
మచ్చుతునక.
సర్దార్ పటేల్ 1950 డిసెంబర్ 15న
తుదిశ్వాస విడిచారు. ఆయన 1947 ఆగస్టు నుంచి మరణించేంత వరకూ భారతదేశపు మొదటి ఉపప్రధానమంత్రిగా,
హోంమంత్రిగా పనిచేసారు. 2018లో పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31న గుజరాత్లో నర్మదా
నదిలోని సాధుబెట్ అనే చిన్నద్వీపంలో ఆయన విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 182 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ
విగ్రహం ప్రపంచంలోనే పెద్దది. దీన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ – ఐక్యతా విగ్రహం అని
వ్యవహరిస్తున్నారు. నర్మదకు అభిముఖంగా నిలబడిన సర్దార్ పటేల్ మనకు నేటికీ
స్ఫూర్తినందిస్తున్నారు.