పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. లోక్సభలో పొగ వదిలిన కేసును ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్టైన మహేశ్, కైలాష్ రాజస్థాన్ వాసులుగా గుర్తించారు. వీరు జస్టిస్ ఫర్ అజాద్ భగత్ సింగ్ అనే గ్రూపునకు చెందిన వారని తెలుస్తోంది.
పార్లమెంటుపై దాడి కుట్రలో మహేశ్ కూడా ఉన్నాడని, చివరి క్షణంలో కుటుంబ సభ్యులు వారించడంతో అతను ఆగిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. లలిత్ ఝాకు ఇతను సాయం అందించాడని తేలింది.కొన్ని నెలల కిందటే ఈ కుట్రకు ప్లాన్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంటులో ప్రవేశించాలంటే ఎంట్రీ పాస్ తప్పనిసరి. దానికోసం లలిత్ చాలా మందిని అడిగినట్లు తేలింది.
కేసును దర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం ఇప్పటికే ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. కేసులో లింకులు ఉన్న లక్నో, మైసూరు, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానాలకు ఆ బృందాలను పంపనుంది. పొగ వదిలే కాన్సిస్టర్స్ దాచేందుకు లక్నోలో రెండు జతల ప్రత్యేక బూట్లు తయారు చేయించినట్లు వెల్లడైంది. పార్లమెంటుపై దాడి ఘటనపై సీన్ రీక్రియేట్ చేసేందుకు పోలీసులు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.