ప్రధాని మోదీకి 2014 నుంచి నేటి వరకు 14 దేశాల అత్యున్నత పురస్కారాలు లభించాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. 2018లో మోదీకి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ అవార్డును ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ స్థాయి, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాల్లో ప్రధాని చూపిన చొరవకు ఈ అవార్డులు లభించినట్లు తెలిపారు.మోదీ (pm modi) నాయకత్వ పటిమకు గుర్తింపుగా పలు అవార్డులు వచ్చినట్లు మంత్రి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అమెరికాకు భారతీయుల అక్రమ వలసలపై కూడా మంత్రి స్పందించారు. గడచిన ఐదేళ్లలో భారత్ నుంచి అమెరికాకు 2 లక్షల మందికిపైగా అక్రమంగా వలస వెళ్లినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి కేసులు 96 వేలకుపైగా నమోదైనట్లు చెప్పారు. అమెరికా సరిహద్దులు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు అందుబాటులో లేవని మంత్రి రాజ్యసభకు తెలిపారు.