Parliament Security Breach Case : Who are the accused?
పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 22ఏళ్ళు
అయిన 13డిసెంబర్ 2023నే పార్లమెంటు భద్రతను ఛేదించి లోక్‌సభలోకి చొచ్చుకువెళ్ళి
పొగపెట్టిన ఘటన జరిగింది. కేవలం ఆరుగురు వ్యక్తులు ఈ పనిని ఇంత సులువుగా చేయడం, పార్లమెంటు
భద్రతా వ్యవస్థకు సవాల్ విసిరింది. ఈ కుట్ర వెనుక సూత్రధారి వేరే ఇంకెవరో అని పోలీసులు
స్పష్టం చేసారు. అయితే బైటకు కనిపిస్తున్న ఈ నిందితుల కథ ఏమిటి? వారి సైద్ధాంతిక
భావజాలమేమిటి?
పార్లమెంటు లోపలా, బైటా స్మోక్
క్యానిస్టర్స్ విసిరి, రంగురంగుల పొగలు వెదజల్లి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
వారు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. ఐతే, ఒక నిర్దిష్ట భావజాలం వారిని
కలిపింది. పోలీసులకు పట్టుబడినప్పుడు వారు దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం,
ద్రవ్యోల్బణం, మణిపూర్ హింస వంటి అంశాలను హైలైట్ చేసి వాటిపై పార్లమెంటులో చర్చ
జరిగేలా చేయడం కోసమే ఇలాంటి దాడికి పాల్పడ్డామని చెప్పారు. తరచిచూస్తే వారిది వామపక్ష
భావజాలమని తెలుస్తోంది.
సాగర్ శర్మ (27) (Sagar Sarma) : పార్లమెంటు
సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్స్‌లోకి మొదట దూకినవాడు. ఇతను ఢిల్లీలో
పుట్టి, ఉత్తరప్రదేశ్ లక్నోలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇ-రిక్షా నడుపుతూ కుటుంబానికి
చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇతని సోషల్ మీడియాను పరిశీలించిన పోలీసులు, సాగర్ శర్మ
తన సోషల్ పోస్టుల్లో భగత్ సింగ్, చే గెవారా వంటి మార్క్సిస్టు విప్లవకారుల రచనలను ప్రస్తావించేవాడని
వెల్లడించారు. ఆదివారమే ఢిల్లీ వచ్చిన సాగర్, తాను దేశ రాజధానిలో ఆందోళనలో
పాల్గొనడానికి వెళ్తున్నానని ఇంట్లోవాళ్ళకు చెప్పాడు. సాగర్ వామపక్ష భావజాలం కలిగినవాడని
తెలుస్తోంది.
డి మనోరంజన్ (34) (D Manoranjan) : సాగర్ శర్మతో పాటు
లోక్‌సభలో గందరగోళం సృష్టించిన మరో వ్యక్తి. కర్ణాటక మైసూరుకు చెందిన మనోరంజన్
కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసాడు. అయితే అతను ఏదైనా ఉద్యోగం చేసాడో
లేదో తెలియరాలేదు. మనోరంజన్ తండ్రి దేవరాజె గౌడ (Devaraje Gowda) తన కొడుకు చర్యను తీవ్రంగా
ఖండించాడు. ‘‘ఈ పార్లమెంటు మన దేవాలయం. గాంధీ నుంచి నెహ్రూ వరకూ ఎందరో కలిసి ఆ
ఆలయాన్ని నిర్మించారు. అలాంటి ఆలయంలో అలా వ్యవహరించడం సరి కాదు. ఆ పని చేసింది నా
కొడుకైనా తప్పే. నా కొడుకు నేరం చేస్తే అతన్ని ఉరితీయండి’’ అని స్పందించాడు.
నీలం ఆజాద్ (37) (Neelam Azad) : హర్యానాలోని హిసార్‌కు
చెందిన నీలం ఆజాద్ ఎంఫిల్ చేసి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) కూడా క్లియర్ చేసింది.
పార్లమెంటు బైట స్మోక్ క్యానిస్టర్స్ వదిలిన ఇద్దరిలో ఈమె ఒకరు. ప్రభుత్వ
నియంతృత్వం నశించాలి అంటూ నినాదాలు చేసింది. నీలం రెండేళ్ళ క్రితం పంజాబ్‌లో
రైతుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొంది. రెజ్లర్లపై లైంగికవేధింపుల
ఆరోపణల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లోనూ పాల్గొంది.
ఆమె కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్న ఆరోపణలు కూడా వచ్చాయి, కానీ సరైన ధ్రువీకరణ
లేదు. ఉన్నత విద్యలు అభ్యసించినా ఉద్యోగం రాకపోవడం వల్ల నీలం తీవ్ర ఒత్తిడిలో
ఉందని ఆమె తల్లి మీడియాకు చెప్పారు. అయితే రకరకాల ఉద్యమాలు, నిరసనల్లో పాల్గొన్న
నీలంకు రాజకీయ సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.
అమోల్ షిండే (25) (Amol Shinde) : మహారాష్ట్ర లాతూర్
జిల్లాలోని ఒ చిన్న గ్రామానికి చెందిన అమోల్ షిండే ఎస్సీ సామాజికవర్గానికి
చెందినవాడు. అతని తండ్రి ఒక వ్యవసాయ కూలీ. పోలీసు లేదా ఆర్మీ ఉద్యోగంలో చేరాలని
ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కానీ అర్హత పరీక్షల్లో ఎప్పుడూ సఫలం కాలేదు.
విక్కీ శర్మ, రేఖ దంపతులు (Vicky Sarma and Rekha couple) : పై నలుగురికీ
ఢిల్లీ గుర్గావ్లో ఆశ్రయం ఇచ్చిన దంపతులు వీరు. విక్కీ ఒక ఎక్స్పోర్ట్
కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని
ప్రశ్నిస్తున్నారు.
లలిత్ ఝా (Lalit Jha) : ఈ కేసులో పరారీలో ఉన్న
నిందితుడు లలిత్ ఝా బిహార్ వాస్తవ్యుడు, ఢిల్లీ గుర్గావ్లో నివసిస్తున్నాడు.
పార్లమెంటు బైట గొడవను వీడియోలు తీసింది ఇతనే. ఘటన జరిగిన తర్వాత నిందితులదరి
మొబైల్ ఫోన్లూ తీసుకుని పరారయ్యాడు. ఆ వీడియోను అతను పశ్చిమబెంగాల్ పురూలియా
జిల్లాలో గిరిజన విద్య కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న నీలాక్షా ఐచ్ (Neelaksha Aich) అనే
మహిళకు పంపించాడు.
లలిత్ గురించి తనకు పెద్దగా వివరాలేమీ
తెలియవని నీలాక్ష చెప్పారు. ఈ యేడాది ఏప్రిల్‌లో లలిత్ ఝా తమ స్వచ్ఛంద సంస్థలో
చేరాడన్నారు. అయితే లలిత్ ఎప్పుడూ తనగురించి ఎలాంటి చిన్న వివరమూ చెప్పలేదన్నారు.
తాను ఎక్కడ ఉంటాడు, తన కుటుంబం వివరాలేంటి, తను ఏం చేస్తూ ఉంటాడు… అలాంటి కనీస
ప్రాథమిక వివరాలు కూడా ఎప్పుడూ తమకు చెప్పలేదని నీలాక్ష వెల్లడించారు. నిన్న
మాత్రం తను కళాశాలలో ఉండగా లలిత్ ఫోన్ చేసి వార్తలు చూడమన్నాడనీ, తను సాయంత్రం
ఇంటికి వచ్చాకే విషయం తెలిసిందనీ ఆమె చెప్పారు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగానే
ఉండేదని నీలాక్ష వివరించారు.