విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రిలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. ఆస్పత్రి మొదటి అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగాయి. తర్వాత మిగిలిన అంతస్తులకు వ్యాపించాయి. ఆస్పత్రి సిబ్బంది సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఆసుపత్రిలోని 40 మంది రోగులను సురక్షితంగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో, ఆవరణలో దట్టమైన పొగ వ్యాపించింది. పై అంతస్తుల్లోని రోగులను నిచ్చెనల సాయంతో కిందకు దించి సమీపంలో ఆసుపత్రులకు తరలించారు. ఇండస్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంతో రోగులు, వారి బంధువులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.