గాజాలో హమాస్ ఉగ్రవాదులతో పోరాడుతోన్న ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ ఉగ్రవాదుల (israel hamas war) నుంచి ఇజ్రాయెల్ సైన్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉత్తరగాజాలో హమాస్ ఉగ్రవాదుల దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు హమాస్ ఉగ్రవాదులతో జరిగిన యుద్ధంలో 115 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
షెజాయాలో ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 9 మంది ఐడిఎఫ్ అధికారులు మరణించారు. వారిలో గొలానీ బ్రిగేడ్ కమాండర్ల బృందం అధిపతి ఇజ్జాక్ బెన్ కూడా ఉన్నారు. మరణించిన వారిలో ఒక కర్నల్, ఇద్దరు కమాండర్లు, ఒక మేజర్ ఉన్నారు. గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గాజాలో మానవ సంక్షోభం తలెత్తే ప్రమాద ముందని కూడా ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయినా ఇజ్రాయెల్ సైన్యం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. గాజాలో కాల్పుల విరమణపై ఐరాసలో భారత్ అనుకూలంగా ఓటు వేసింది.