మధ్యప్రదేశ్
కొత్త సీఎం మోహన్ యాదవ్ ప్రమాణస్వీకారం చేసిన రోజే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
మతపరమైన ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించారు. నిర్ణీత
డెసిబెల్స్ పరిధి దాటి శబ్దం చేసే స్పీకర్లపై
నిషేధం విధించారు. నియంత్రణ లేని లౌడ్ స్పీకర్లపైనే నిషేధం విధించినట్లు ప్రభుత్వ
వర్గాలు స్పష్టం చేశాయి.
బహిరంగ
ప్రదేశాల్లో మాంసం, గుడ్ల విక్రయాలపై కూడా
ఆంక్షలు విధించారు. ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా
ప్రభుత్వ చర్యలు ఉంటాయని అధికారులు వివరించారు. డిసెంబర్ 15 నుంచి 31 వరకు ఈ
నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపారు. జనాల్లో సరైన అవగాహన కల్పించిన తర్వాతే నిబంధనలు
ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఫుడ్ డిపార్టుమెంటు, పోలీసు, మున్సిపల్ శాఖల
అధికారులు సంయుక్తంగా ఈ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయోధ్య
రాముడి దర్శనానికి వెళ్లే భక్తులకు మధ్యలో మధ్యప్రదేశ్ తరఫున స్వాగతం పలుకుతామని
రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. తునికాకు సేకరించే వారికి బస్తాకు రూ. 4 వేలు చెల్లించాలని
కేబినెట్ నిర్ణయించింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, బుధవారం ప్రమాణస్వీకారం
చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్
జయప్రకాశ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.