Parliament security breach accused charged under anti-terror law
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన కేసులో
నిందితుల మీద ఉగ్రవాద వ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం,
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నలుగురు నిందితులనూ ఇవాళ
కోర్టులో ప్రవేశపెడతారు.
నలుగురు నిందితుల్లో ఇద్దరు లోక్‌సభ లోపల
స్మోక్ క్యానిస్టర్స్ ఉపయోగించిన సాగర్ శర్మ, డి మనోరంజన్. మరో ఇద్దరు పార్లమెంటు
బైట స్మోక్ క్యానిస్టర్స్ వాడిన నీలం దేవి, అమోల్ శర్మ.
మరో ఇద్దరు నిందితులు లలిత్ ఝా,
విక్కీ శర్మ గుర్గావ్కు చెందిన వారు. లలిత్ ఝా, పార్లమెంటు బైట నీలం, అమోల్ స్మోక్
క్యానిస్టర్స్ నుంచి పొగ వదులుతుంటే దాన్ని
వీడియో తీసి, వారిద్దరి ఫోన్లనూ తనతో తీసుకుని పరారైపోయాడు. విక్కీ శర్మ ఈ
నిందితులందరికీ తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడు. అతన్ని, అతని భార్యనీ పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుల గురించి
కొన్ని విషయాలు తెలిసాయి. అవి ఇలా ఉన్నాయి…
నిందితులు నలుగురూ ‘భగత్‌సింగ్
ఫ్యాన్ క్లబ్’ అనే ఒక సోషల్ మీడియా గ్రూప్‌లో ఉన్నారు. వీరందరూ ఏడాదిన్నర క్రితం
మైసూరులో ఒకసారి సమావేశమయ్యారు. తమ ప్రణాళిక గురించి చర్చించారు. తొమ్మిది నెలల
క్రితం మరోసారి చండీగఢ్ విమానాశ్రయం దగ్గర రైతుల నిరసన కార్యక్రమం నేపథ్యంలో
సమావేశమయ్యారు.
సాగర్ శర్మ ఈ యేడాది జులైలో లక్నో
నుంచి ఢిల్లీ వచ్చాడు. ఆ సమయంలో పార్లమెంటు లోపలికి ప్రవేశించలేకపోయాడు, కానీ బైట
రెక్కీ నిర్వహించాడు. పార్లమెంటు వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో
తెలుసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఆదివారం అంటే డిసెంబర్ 10న ఢిల్లీ వచ్చాడు.
మిగతా నిందితులతో కలిసి గుర్గావ్లోని విక్కీ ఇంట్లో బస చేసాడు.
ఈ దాడిలో ఉపయోగించిన స్మోక్
క్యానిస్టర్స్ను అమోల్ షిండే మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి తీసుకొచ్చాడు. ఘటన
జరిగిన రోజు అంటే డిసెంబర్ 13న ఇండియాగేట్ దగ్గర అందరూ సమావేశమయ్యారు. అక్కడ అమోల్
షిండే క్యానిస్టర్స్ పంపిణీ చేసాడు.
నిజానికి ఈ ముఠా సభ్యులు ఆరుగురూ పార్లమెంటులోకి
ప్రవేశించాలని భావించారు. కానీ సాగర్ శర్మ, మనోరంజన్ మాత్రమే పాసులు సంపాదించగలిగారు.
వాళ్ళిద్దరూ పార్లమెంటులోకి మధ్యాహ్నం ప్రవేశించారు.
బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాగర్
శర్మ లోక్‌సభ లోపల విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్లోకి దూకాడు. ఒక స్మోక్
క్యానిస్టర్ తెరిచి సభలో బెంచీల మీద నుంచి గెంతుకుంటూ ముందుకు పోయాడు. ఎంపీలు
అతన్ని పట్టుకున్నారు. అంతలో మనోరంజన్ మరో స్మోక్ క్యానిస్టర్ తెరిచాడు.
కొద్దిసేపట్లో అతను కూడా దిరికిపోయాడు. దాదాపు అదే సమయంలో పార్లమెంటు బైట నీలం,
అమోల్ కూడా స్మోక్ క్యానిస్టర్లు తెరిచి పొగ వదిలారు. ‘నిరంకుశత్వం నశించాలి’ అంటూ
నినాదాలు చేసారు.
ఢిల్లీ పోలీస్ యాంటీ టెర్రర్ సెల్,
నిందితులను ప్రశ్నిస్తోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు వారి భద్రత విషయమై
హామీ ఇచ్చారు. జరిగిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల
దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
నిందితులపై
నేరపూరిత కుట్ర, శత్రుత్వాన్ని వ్యాపింపజేయడం, ప్రజాప్రతినిధుల విధినిర్వహణకు
ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై ఐపీసీ కింద కేసు నమోదు చేసారు.