Five Arrested in Parliament Security Breach Case, One on run
పార్లమెంటుభద్రతను ప్రశ్నార్థకం చేసిన భద్రతా ఉల్లంఘన కేసులో మొత్తం ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు
ఢిల్లీ పోలీసులు గుర్తించారు. వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసారు. మరో వ్యక్తి
పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన సాగర్ శర్మ, కర్ణాటక
మైసూరుకు చెందిన డి. మనోరంజన్ పార్లమెంటులోపల విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభ
ఛాంబర్లోకి దూకారు. అక్కడ తమ కాలి షూలో దాచుకున్న స్మోక్ క్యానిస్టర్లను తీసి
సభలో పొగ వదిలారు. వారిని ఎంపీలు పట్టుకుని కొట్టారు. భద్రతా బలగాలకు అప్పగించారు.
మహారాష్ట్ర లాతూర్కు చెందిన అమోల్ షిండే,
హర్యానా హిస్సార్‌కు చెందిన నీలమ్ దేవి పార్లమెంటు వెలుపల స్మోక్ క్యానిస్టర్లు
ప్రయోగించి పొగ వదిలారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారిని
బంధించారు.
గుర్గావ్కు చెందిన లలిత్ ఝా అనే వ్యక్తి ఇంట్లో
ఈ నలుగురు వ్యక్తులూ బస చేసారు. అదే ప్రాంతానికి చెందిన విక్కీ శర్మ కూడా వీరితో
చేతులు కలిపాడు. ఢిల్లీ పోలీసులు ఆ విక్కీ శర్మను కూడా అరెస్ట్ చేసారు. లలిత్ ఝా
మాత్రం ఇంకా దొరకలేదు.
పార్లమెంటులోకి సందర్శకులుగా ప్రవేశించిన సాగర్
శర్మ, మనోరంజన్లకు విజిటర్స్ పాస్‌లు కర్ణాటకలోని మైసూరు నుంచి ఎంపీ అయిన బీజేపీ
నేత ప్రతాప్ సిన్హా కార్యాలయం నుంచి అందాయి. దాంతో, ఈ దాడి వెనుక బీజేపీ హస్తముందంటూ
ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రారంభించాయి.
ఈ ఆరుగురు వ్యక్తులకూ నాలుగేళ్ళుగా సంబంధముంది.
వారందరూ కలిసే ఈ కుట్ర పన్నారు. వారు తమ దాడికి రెక్కీ కూడా చేసారు. వాళ్ళందరూ
పార్లమెంటులోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరికి మాత్రమే పాస్‌లు
లభించాయి.
ఐదుగురు వ్యక్తులు ఇప్పటికే అరెస్ట్ అవగా, ఆరవ
వ్యక్తి కోసం గాలింపు మొదలైంది. వీరికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు
ఇప్పటివరకూ నిర్ధారణ అవలేదు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ సంఘటన జరిగాక లోక్‌సభ
రెండు గంటల వరకూ వాయిదా వేసారు. ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు అఖిలపక్ష సమావేశం
ఏర్పాటు చేసారు. అనంతరం లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.
ఈ ఘటన తర్వాత రాజ్యసభలో
ప్రతిపక్షాల ఇండీ కూటమి ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసారు.