Vishnu Deo Sai swears
in as Chattisgarh CM
కేంద్ర మాజీ మంత్రి, ఛత్తీస్‌గఢ్‌లో
ప్రముఖ గిరిజన నాయకుడు విష్ణుదేవ్ శాయ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ
ప్రమాణస్వీకారం చేసారు. ఆ కార్యక్రమానికి నరేంద్ర మోదీ, అమిత్ షా, తదితర బీజేపీ
సీనియర్ నాయకులు హాజరయ్యారు.
రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ మైదానంలో
జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విష్ణుదేవ్ శాయ్‌తో
ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్ శర్మ, అరుణ్ సావో ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం
చేసారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర
హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు బీజేపీ నేతలు ఆ కార్యక్రమానికి అతిథులుగా
హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా
శాయ్ ప్రమాణస్వీకారానికి హాజరవడం విశేషం.
డిసెంబర్ 3న జరిగిన ఓట్ల లెక్కింపులో 90
నియోజకవర్గాల ఛత్తీస్‌గఢ్ శాసనసభలో బీజేపీ 54 స్థానాలు కైవసం చేసుకుంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాలకు పరిమితమైంది. అయితే బీజేపీ తమ ముఖ్యమంత్రిని ఎంచుకోడానికి
వారం రోజుల సమయం తీసుకుంది. డిసెంబర్ 10న విష్ణుదేవ్ శాయ్ని తమ సీఎంగా ప్రకటించింది.
విష్ణుదేవ్ శాయ్ సాహు (తేలీ) కులానికి
చెందినవారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఆయనకు మంచి పట్టుంది. 1990లో గ్రామసర్పంచ్‌గా
ఎన్నికవడంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1998లో అసెంబ్లీకి పోటీ చేసి
ఓడిపోయారు. 1999నుంచి 2014 వరకూ వరుసగా నాలుగుసార్లు రాయగఢ్ నియోజకవర్గం నుంచి
పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 2020
నుంచి 2022 వరకూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసారు. అంతకు ముందు,
మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో గనులు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా
పనిచేసారు. 2023 నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన కుంకురి నియోజకవర్గం
నుంచి దాదాపు 88వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పుడు బీజేపీ కొత్త
వ్యూహాల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పదవి ఆయనను వరించింది.